Kedarnath : కేదారినాథ్ లో హెలిక్యాప్టర్ కు తప్పిన భారీ ప్రమాదం.. వీడియో వైరల్

Kedarnath

Kedarnath

Kedarnath : ఉత్తరాఖండ్ లోని బాబా కేదార్నాథ్ ధామ్ వద్ద ఓ హెలిక్యాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది. హెలిక్యాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ చాకచక్యంతో అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణికులను కాపాడారు.  ఆరుగురు ప్రయాణికులు, పైలట్ తో కూడిన హెలిక్యాప్టర్ నిన్న ఉదయం సిర్సీ హెలిప్యాడ్ నుంచి ఆలయానికి బయలుదేరింది. అయితే కేదారినాథ్ హెలిప్యాడ్ కు దగ్గరగా వస్తున్న సమయంలో సడెన్ గా హెలిక్యాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సమీపంలోనే దాదాపు 100 మీటర్ల దూరంలో హెలిప్యాడ్ ఉన్నప్పటికీ అక్కడి వరకు హెలిక్యాప్టర్ ను పైలట్ తీసుకెళ్లలేకపోయాడు. చాకచక్యంగా  దగ్గరగా ల్యాండింగ్ కు అనుకూలంగా ఉండే ఖాళీ స్థలాన్ని వెతికి అక్కడే సురక్షితంగా హెలిక్యాప్టర్ ను ల్యాండ్ చేశాడు.

అయితే అక్కడికి కొద్ది దూరంలోనే గుంట ఉంది. ఈ సమయంలో హెలిక్యాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. హెలిక్యాప్టర్ గాల్లోనే తిరుగుతుండడంతో నేలపై ఉన్న వారు కూడా భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అంతా సేఫ్ కావడంతో అక్కడున్న వారందరూ పైలట్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హెలిక్యాప్టర్  లోని సాంకేతిక లోపాలను పైల‌ట్ ముందే చెక్ చేసి ఉండాల్సిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేదార్నాథ్ లో హెలికాప్టర్ సేవ ఎప్పుడూ ప్రమాదకరమేనని, గత 11 ఏళ్లలో 10 ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెప్పారు. ప్రమాదానికి సంబంధించి అక్కడి అధికారులు మాట్లాడుతూ.. సాంకేతిక లోపం కారణంగానే పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని తెలిపారు.

కాగా, చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి, కేదారినాథ్ తో సహ నాలుగు పుణ్యక్షేత్రాలతో మూడింటిని తెరువగా మే 12న బద్రీనాథ్ తలుపులు తెరిచారు. దీంతో భారీ సంఖ్యలో యాత్రకు తరలివెళ్తున్నారు.

TAGS