Srikrishna Devaraya : జనవరి 17..చరిత్రలో ఈరోజుకు ఎంతో విశిష్టత ఉంది.. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల జయంతి. దక్షిణాది రాజ్యాల్లోనే కాదు యావత్ భారత దేశ రాజుల్లో నేటికీ చిరస్మరణీయుడు హిందూ రాజైన శ్రీకృష్ణదేవరాయలది. ఆయన చక్రవర్తిగానే కాదు సాహిత్యపోషకుడుగా కీర్తింపబడ్డారు. ఆయన 1509లో విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించారు. ఈయన పాలన కాలంలోనే విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకున్నది.
శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, కన్నడ రాజ్య రమారమణగా కీర్తింపబడ్డారు. తుళువ వంశానికి చెందిన ఈయన తన పాలన కాలంలో హిందూ సామ్రాజ్య విస్తరణకు పాటుపడ్డారు. ఈయన పాలన గురించి పోర్చుగీసు సందర్శకులు డోమింగోపేస్, న్యూనిజ్ రచనల ద్వారా మనకు తెలుస్తున్నది. రాయలుకు ప్రధాన మంత్రి తిమ్మరసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించడానికి తిమ్మరసు ఎంతో సాయపడ్డాడు. ఆయన్ను శ్రీకృష్ణదేవరాయలు ‘అప్పాజీ’ అని పిలిచేవారు.
శ్రీకృష్ణదేవరాయలు..గొప్ప రాజుగానే కాదు సాహిత్య పోషకుడు కూడా. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కల్యాణం, మదాలసాచరితము, సత్య వధూప్రీణనము, సకలకథా సారసంగ్రహము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథను రాశారు. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని అభివర్ణించింది శ్రీకృష్ణదేవరాయలే. రాయల అస్థానానికి ‘భువన విజయం’ అనే పేరు ఉండేది. దీనిలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన్న, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది కవులు ఉండేవారు. వీరు అష్టదిగ్గజములుగా కీర్తిపొందారు.
శ్రీకృష్ణదేవరాయలు మంచి భక్తుడు కూడా. అనేక వైష్ణవాలయాలను, శివాలయాలను నిర్మించాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు. ఇతడు తన కుమారుడికి తిరుమల దేవరాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు. ఈయనకు తిరుమలదేవి, చిన్నా దేవి అనే ఇద్దరు భార్యలు.
ఇక శ్రీకృష్ణదేవరాయలు కులం గురించి ఏపీలో వివిధ వివాదాలు ఉన్నాయి. ఈయనది ఏ కులం అనే విషయంలో సాహిత్యవేత్తల్లోనూ, చరిత్రకారుల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం నేపథ్యంగా పలు తెలుగు సినిమాలు కూడా వచ్చాయి. మల్లీశ్వరి, మహామంత్రి తిమ్మరసు, తెనాలి రామకృష్ణ, ఆదిత్య 369. ఇలా శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాదిన ముఖ్యంగా తెలుగునేల రాయలసీమలో ఆయన ప్రభావం గణనీయమైనది. నిన్న ఏపీ వ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయలు 533వ జయంతి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు. వందల ఏండ్లు గడిచినా.. ఇప్పటికీ, ఎప్పటికీ మరిచిపోలేని యుగ, చారిత్రక పురుషుడు ఆయన.