Chiranjeevi : ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూటమిగా ఏర్పడటాన్ని నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి స్వాగతించారు. ‘ఇది మంచి పరిణామం.. చాలా సంతోషం. చాలా కాలం తర్వాత ఇప్పుడే రాజకీయాలపై మాట్లాడుతున్నా.. ప్రధాన కారణం తమ్ముడు పవన్ కల్యాణ్’ అని చిరంజీవి అన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలనేది నా కున్న కోరిక.. అందుకు అందరూ కలిసి నడుం బిగించండి.. మీరంతా ఎన్‌డీఏ అభ్యర్థులైన సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్‌కు ఓటేయాలి.. మీ ఆశీస్సులు వారికి ఉన్నాయనే భావనను, నమ్మకాన్ని కలిగించండి’ అని మెగా అభిమానులకు పిలుపునిచ్చారు. అనకాపల్లి నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్ హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసం ఆయనను కలిశారు. తమ మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ వారికి మద్దతిస్తూ.. వీరిని గెలిపించాలని కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. ‘సీఎం రమేశ్ నా చిరకాల మిత్రుడు, పంచకర్ల రమేశ్ నా ఆశీస్సులతోనే రాజకీయ అరంగేట్రం చేశారు. ఇద్దరూ కావాల్సినవారే.. ఇద్దరూ మంచి వారే కాదు. సమర్థులు.. వారిని గెలిపించండి. నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడతారని నేను హామీ ఇస్తున్నా’ అని చిరంజీవి మెగా ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. ‘నేను ఎప్పటి నుంచో సీఎం రమేశ్ గురించి వింటున్నా.. చూస్తున్నా.. ఆయనకు కేంద్రంతో ఉన్న సత్సంబంధలు పరిచయాలు అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడతాయి’ అని చిరంజీవి పేర్కొన్నారు.