America : భారతీయులకు మంచి ఛాన్స్.. పౌరసత్వం ఇవ్వనున్న అమెరికా.. ఎన్నికల్లో ఓటేసేందుకు ఈ ప్రక్రియ షురూ..
America : చాలా మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మంచి ఉద్యోగ అవకాశాలు, అధిక వేతనం, మంచి విద్య, నాణ్యమైన వైద్యం అన్నీ అమెరికాలో దొరుకుతాయి కాబట్టి. యూఎస్ పౌరసత్వం స్థిరమైన రాజకీయ వాతావరణాన్ని, బలమైన చట్టపరమైన రక్షణను అందిస్తుంది. ఇది సుదీర్ఘమైన, కఠినమైన ప్రక్రియ అయినప్పటికీ ప్రతీ భారతీయుడు దాని కోసం శ్రమిస్తాడు.
నవంబర్ 5, 2024వ తేదీ జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు, ఓటు వేసేందుకు నమోదు చేసుకోవడానికి అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు హోల్డర్లను ప్రోత్సహిస్తోంది. గ్రీన్ కార్డ్ ఉన్న ఒక వ్యక్తి యూఎస్ లో శాశ్వత నివాసి అని చూపిస్తుంది. చాలా మంది గ్రీన్ కార్డు హోల్డర్లు ఆసియా లేదా భారత భూబాగం నుంచి వచ్చినవారే.
ఏఏపీఐ విక్టరీ ఫండ్ కు చెందిన శేఖర్ నరసింహన్ ఐదేళ్లుగా అమెరికాలో ఉంటున్న గ్రీన్ కార్డుదారుడు ఆ దేశం పౌరసత్వం పొందాలని, ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. స్నేహితులకు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసేందుకు వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేయాలని సూచించారు. బైడెన్ పాలనలో ఐదేళ్ల పాటు గ్రీన్ కార్డు హోల్డర్ గా ఉంటే మూడు వారాల్లో అమెరికా పౌరసత్వం పొందే అవకాశం ఉందన్నారు. కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వం భారతీయ అమెరికన్లు, ఇతరుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోందని నరసింహన్ పేర్కొన్నారు.
2022లో, యూఎస్ లో 12.9 మిలియన్ల గ్రీన్ కార్డు హోల్డర్లు ఉన్నారు. వీరిలో 9.2 మిలియన్ల మంది పౌరసత్వానికి అర్హులు. ఏటా 10 లక్షల మందికి గ్రీన్ కార్డులు లభిస్తున్నాయి. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ సంఖ్య తగ్గినప్పటికీ, 2022 లో అవి మళ్లీ పెరిగాయి.
2023లో 59,000 మంది భారతీయులకు పౌరసత్వం లభించడంతో భారత్ రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. యూఎస్సీఐఎస్ వార్షిక నివేదిక ప్రకారం.. ఆ సంవత్సరం 870,000 మంది విదేశీయులు యూఎస్ పౌరులయ్యారు, మెక్సికో అగ్ర వనరు దేశంగా ఉంది.