Nara Lokesh : నాన్నకు బహుమతి.. 164 సీట్ల విజయసాధనలో ‘లోకేశ్ అలుపెరుగని పోరు’దే కీలకపాత్ర
Nara Lokesh : ‘‘కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి..’’ అనే పాటను ఇక గెలిస్తే గెలవాలిరా లోకేశ్ లాగా.. అన్నట్టుగా పాడుకోవాలేమో..2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి సాధించిన ఘన విజయం టీడీపీ చరిత్రలో సువర్ణక్షరాలతో నిలిచిపోతోంది. అందులో నారా లోకేశ్ చేసిన కృషిని, పడిన కష్టాన్ని ఏ టీడీపీ కార్యకర్త మరిచిపోలేడు.
2019లో మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్.. ప్రస్తుత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలువడమే కాదు..టీడీపీ కూటమి ఘన విజయంలో కీలకపాత్ర పోషించారు. కూటమి అధికారంలోకి రాగానే మరోసారి రాష్ట్ర మంత్రిగా తన రాజకీయ భవిష్యత్ ను తానే శిఖరస్థాయికి చేర్చుకుంటున్నారు. రాజకీయ నాయకుడిగా లోకేశ్ తన కీర్తిని పెంచుకుంటూ వెళ్లడంపై ఆయన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ముఖ్యంగా తన రాజకీయ వారసుడి అద్భుత విజయాలను చూసి తండ్రి చంద్రబాబు మురిసిపోతున్నారు. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా లోకేశ్ తాను సాధించిన ఘన విజయాలను తండ్రి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇచ్చారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నాయి.
ఈ సందర్భంగా.. గత సీఎం జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనపై యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజా తిరుగుబాటుగా మారి చివరకు వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించిన తీరును టీడీపీ శ్రేణులు వీడియోలు, షార్ట్స్ రూపంలో షేర్ చేస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి విశాఖ వరకు 226 రోజులపాటు 97అసెంబ్లీ నియోజకవర్గాలు, 2300 గ్రామాలమీదుగా 3132 కి.మీ.ల మేర సాగిన యువగళం పాదయాత్ర జగన్ విధ్వంసక పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో సంపూర్ణ విజయం సాధించిందనే చెప్పవచ్చు. చంద్రబాబును అకారణంగా జైలులో పెట్టి రాక్షసానందం పొందిన జగన్ పై లోకేశ్ ఓట్ల యుద్ధం చేసి ఘన విజయం సాధించారు. దారుణ ఓటమితో జగన్ రెడ్డికి నిద్రలేని కాళరాత్రులే మిగులుతున్నాయి.