Viral Video : ఇటీవలి కాలంలో కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ దీని బారిన పడి చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో కార్డియాక్ అరెస్ట్ ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సీపీఆర్ చేసే విధానంపై దృష్టి సారించాలని చేసిన ఓ చిన్న వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ..అందరికీ సీపీఆర్ విధానం అవగాహన కలిగిస్తోంది. ఈ వీడియోను మీరు కూడా చూసి దాన్ని ఇతరులకు షేర్ చేస్తే వారు కూడా ఈ విధానం గురించి తెలుసుకుంటారు.
ఆ వీడియోలో ఏముందంటే.. ముగ్గురు ఫ్రెండ్స్ ఏదో పని మీద బయటకు వెళ్లి ఇంటికి చేరుకుంటారు. అప్పటికే వారు బాగా అలసిపోయి ఉంటారు. దాహంగా ఉండడంతో అందులో ఓ పెద్ద యువకుడు అక్కడే ఉన్న బాటిల్ నీళ్లు తాగుతాడు. ఆ తర్వాత మిగతా ఇద్దరు చూస్తుండగానే స్పృహ తప్పిపోతాడు. ఇంతలో వారు ఆందోళన చెంది ఏమైంది అన్నయ్యా..అంటూ అతడి తడుతూ ఉంటారు. అందులో ఒకరు అది గుండెపోటుగా భావించి..తనకు కాలేజీలో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించిన తీరుతో అతడికి సీపీఆర్ చేయాలనుకుంటాడు. అదే టైంలో 108కి కూడా ఫోన్ చేస్తారు. ఒకరు గుండెపై రుద్దుతూ ఉండగా..మరొకరు బాధితుడి నోటిలోకి తన నోరు ద్వారా గాలిని ఊదుతాడు. అంతలోనే 108 రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తారు. అక్కడ బాధితుడికి డాక్టర్ చికిత్స చేస్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు యువకులను సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించినందుకు వారిని మెచ్చుకుంటాడు. ప్రతి ఒక్కరూ సీపీఆర్ విధానం తెలుసుకోవాలని, ఈ విషయంపై అందరికి అవగాహన కల్పించాలని కోరుతాడు.
సీపీఆర్ ఎలా చేయాలి..?
గుండెపోటుకు గురైన వ్యక్తిని మంచంపై పడుకోబెట్టాలి. కుడి చేతి వేళ్లను ఎడమ చేతి వేళ్ల మధ్య లేదా ఎడమ చేతి వేళ్లను కుడి చేతి వేళ్ల మధ్య చొప్పించండి. బాధితుడి ఛాతీ మధ్యలో (గుండెపై కాదు) నొక్కండి. ప్రెస్ క్రమంగా చేయాలి. నొక్కేటప్పుడు మన చేతులు, మోచేతులు బెండ్ కాకుండా బాధితుడి చాతి కనీసం 5 సెంటి మీటర్లు లోతుకు వెళ్లేలా నొక్కాలి. ఎముకలు విరిగిపోతాయని భయపడకూడదు. నిమిషానికి వంద సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేయండి. ఒక నిమిషం అలా చేసిన తర్వాత పల్స్ చెక్ చేయాలి. పల్స్ దొరక్కపోతే ప్రక్రియను మళ్లీ కొనసాగించాలి. ఇలా ఒకేసారి 20-30 నిమిషాలు చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు గుండె మళ్లీ కొట్టుకునే అవకాశం ఉంది. గుండెపోటు వచ్చిన వెంటనే సీపీఆర్ చేయడం ప్రయోజనకరం. ఆలస్యంగా చేసినా ప్రయోజనం ఉండదు. ఇలా చేస్తున్నప్పుడు 108 వాహనం, ఇతర ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల అంబులెన్స్‌లకు సమాచారం అందించాలి. వెంటనే వైద్య సహాయం కోసం ఆసుపత్రికి వెళ్లండి.
సీపీఆర్ వల్ల ఏం జరుగుతుందంటే..
ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ప్రతిస్పందనలో కీలకమైన భాగం. గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది. తక్షణ సహాయం అందించకపోతే నిమిషాల్లో మెదడు దెబ్బతింటుంది లేదా మరణం సంభవించవచ్చు. అత్యవసర వైద్య సేవలు వచ్చే వరకు రక్తాన్ని ముఖ్యమైన అవయవాలకు ప్రవహించేలా సీపీఆర్ సహాయపడుతుంది. ఛాతిని నొక్కడం రెస్క్యూ విధానాలను అందించడం ద్వారా శరీరం అంతటా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని అందించడం. ఇది మెదడు, ఇతర అవయవాలకు ఆక్సిజన్ అందించడంలో సహాయపడుతుంది. నష్టం తీవ్రతను తగ్గిస్తుంది. దీని వల్ల బతికే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.