Priyanka Chopra:డీప్ ఫేక్ టెక్నాలజీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు సంకటంగా మారింది. ఇటీవల
నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడమే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ వివాదంపై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు టాలీవుడ్ స్టార్స్ చాలా వరకు స్పందించి ఈ లాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ వివాదం మర్చిపోకముందే బాలీవుడ్ నటి అలియా భట్‌కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం సృష్టించింది.
తాజాగా ఈ వివాదం హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాని తాకింది. ప్రియాంక చోప్రాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక గతంలో మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖం మార్చకుండా అందులోని వాయిస్‌ను కొందరు ఆకతాయిలు మార్చి దాన్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు. ప్రియాంక ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్టు లిప్ సింక్ చేశారు. ఇదే వీడియోలో ప్రియాంక తన వార్షిక ఆదాయాన్ని వెల్లడించినట్టుగా రూపొందించారు.
ఒక బ్రాండ్ కారణంగా 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని, అందరూ దాన్ని ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లు ఆ వీడియోని క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై పలువురు స్పందిస్తూ ఇలా సృష్టించడం దారుణం అని మండిపడుతున్నారు. దీంతో ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.