Gold Ornaments : వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడింది. ఈ ఘటన తమిలనాడులోని ఈరోడ్ సమీపం చిటోడేలో 810 కిలోల బంగారు ఆభరణాలతో వెళ్తున్న ఓ ప్రైవేట్ కంటెయినర్ సోమవారం రాత్రి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. అందులో ఉన్న ఆభరణాల విలువ దాదాపు రూ.666 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
ఓ ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థకు చెందిన కంటెయినర్ బంగారు ఆభరణాలతో కోయంబత్తూరు నుంచి సేలంకు వెళ్తోంది. సమతువపురం సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శశికుమార్ తో పాటు సెక్యూరిటీ గార్డు బాల్ రాజ్ గాయపడ్డారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న చిటోడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, కంటెయినర్ లోపల ఉన్న ఆభరణాలు సురక్షితంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత యజమానులకు సమాచారం అందించడంతో వారు వెంటనే అక్కడికి కొత్త కంటెయినర్ ను పంపించగా, బోల్తాపడిన వాహనంలోని ఆభరణాలను అందులోకి ఎక్కించి సేలంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.