Kono Corpus Plant : పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలని పెద్దలు చెప్పారు.. అందుకే ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతుంటాయి. పచ్చని చెట్లతో గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని చెప్పలేం. వాటి వల్ల మానవాళితో పాటు పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతోంది. అటువంటి ప్రమాదకరమైన మొక్కల్లో కోనో కార్పస్ ఒకటి. ఈ మొక్కలను రోడ్ల పక్కన, డివైడర్లలో విరివిగా నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం ఈ మొక్కలను విరివిగా పెంచుతారు. అందాన్ని దృష్టిలో పెట్టుకుంటే వీటి వల్ల జరిగే నష్టం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
ఈ చెట్లను దుబాయ్ చెట్లు అని కూడా అంటారు. అమెరికా ఖండంలోని తీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇది వేగంగా అభివృద్ధి చెందే లక్షణాన్ని కలిగి ఉంది. అలాగే కోన్ షేప్ లో పచ్చగా అందంగా ఉంటుంది. ప్రత్యేకించి అరబ్ దేశాల్లో ఇళ్లపై దుమ్ము రాకుండా ఈ చెట్లను పెంచుతున్నారు. వేగంగా పెరుగుతున్న ఈ ఆకర్షణీయమైన మొక్కను నర్సరీమెన్, ఇతర ల్యాండ్‌స్కేప్ కళాకారులు భారతదేశానికి దిగుమతి చేసుకున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈ మొక్కలను ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత రోడ్లు అందంగా ఉండాలనే ఉద్దేశంతో డివైడర్లు, ఫుట్ పాత్ ల పక్కన ఈ చెట్లను నాటారు.
అయితే ఈ కోనో కార్పస్ ప్లాంట్ల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని చెబుతున్నారు. ఈ చెట్లు పువ్వుల నుంచి పుప్పొడిని పుష్కలంగా ఉత్పత్తి చేస్తాయి. గాలిలోకి చేరిన పుప్పొడిని మనుషులు పీల్చితే శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ మొక్కను నిషేధించాయి. ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా ఈ మొక్కలు నాటడాన్ని నిషేధించింది. తొలుత ఈ మొక్కలను విరివిగా నాటగా, ఈ మొక్కల వల్ల కలిగే నష్టాలను గుర్తించి నాటడం ఆపేశారు.
ఈ క్రమంలో.. కాకినాడలో కోనో కార్పస్ చెట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మొక్కల కారణంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాసకోస సమస్యలు, ఆస్తమా తలెత్తుతున్నాయని వారు గుర్తించారు. అంతేకాకుండా ఈ చెట్టు భూ గర్భంలోని జలాన్ని ఇట్టే తోడేస్తుందని.. ఒక్కసారి ఈ మొక్కను నాటితే 80 మీటర్ల వరకూ దీని వేరు భూమిలోకి వెళ్లిపోయి నీరును తాగేస్తుందని హెచ్చరిస్తున్నారు.
కాకినాడ వాసులు ఈ చెట్ల గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. అటవీ శాఖ సమీక్షలో దీనిపై వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించడం మంచిదన్నారు. కాకినాడలో మొత్తం 4,602 కానో కార్పస్ చెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని దశల వారీగా తొలగించాలని అధికారులకు సూచించారు.