Pemmasani Chandrasekhar : ఏపీలో టీడీపీ సాధించిన ఘన విజయం..ఎన్నో ప్రయోజనాలను తీసుకొస్తోంది. అతలాకుతలమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అత్యంత అనుభవశాలైన చంద్రబాబు సీఎంగా రావడం..కేంద్రంలో టీడీపీ మద్దతు కీలకం కావడం..తద్వారా ఏపీకి ఎంతో మేలు చేసే ప్రాజెక్టులను తీసుకొచ్చే అవకాశం దొరకడం.. అలాగే తెలుగు వ్యక్తి జాతీయ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పడం..వంటి శుభపరిణామాలు అనూహ్యంగా లభించాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక పదవులు వచ్చే అవకాశం కూడా ఉంది. 3-5 మంత్రి పదవులు దక్కవచ్చనే ప్రచారం సైతం జరుగుతోంది.
ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి పదవులు ఎవరెవరిని వరిస్తాయా? అనే చర్చ రాష్ట్రంలో ఇప్పటికే మొదలైంది. ప్రజలతో పాటు రాజకీయ వర్గాలు, మీడియా వర్గాల్లోనూ ఈ చర్చ నడుస్తూనే ఉంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వీరికి చాన్స్ ఉండొచ్చు..వారికి చాన్స్ ఉండొచ్చు అంటూ వివిధ ఊహగానాలు చేస్తున్నారు. ఫైనల్ గా ఎవరికీ మంత్రి పదవి అప్పగించాలనే నిర్ణయం చంద్రబాబుదే. ఆయన మస్తిష్కంలో ఎవరున్నారో..ఎవరికీ తెలియదు. అయినా కూడా చర్చలు నడుస్తున్నాయి. మంత్రి పదవి ఎవరికీ లభిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కువ అవకాశం ఉంటుందనే నేపథ్యంలో కూడా చర్చ సాగుతోంది.
ఈ చర్చల్లో విరివిగా వినిపిస్తున్న పేరు పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన గుంటూరు లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. పెమ్మసాని వైద్యుడని అందరికీ తెలిసిందే. ఆయన అమెరికాలో పెద్ద వ్యాపారి కూడా. విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన అనుభవం పనికి వస్తుంది. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితిలో కంపెనీలు తీసుకురావాల్సిన అవసరముంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంపెనీలు పెద్ద ఎత్తున ఏపీకి రావాలంటే అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న పెమ్మసాని అవసరం ఏపీకి ఉంది. కేంద్రంలో మంత్రి పదవి వరిస్తే ఆయన ద్వారా ఏపీకి పెట్టుబడులు తీసుకురావొచ్చు. అలాగే వివిధ కంపెనీలు స్థాపించి ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఈ కారణం చేత పెమ్మసాని పేరుని చంద్రబాబు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. వివిధ సమీకరణాల వల్ల చూసినా పెమ్మసానికి కేంద్రంలో మంత్రి పదవి ఖాయమనే చర్చ నడుస్తోంది. అయితే పెమ్మసానికి చంద్రబాబు అవకాశం ఇస్తారా? అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నారనేది త్వరలోనే తెలియనుంది.