KTR : కేటీఆర్ పై కేసు నమోదు.. ఎంత కష్టకాలం వచ్చే!

KTR

KTR

KTR : ఒక పార్టీ అధికారంలో ఉంటేనే దాని ప్రభ వెలిగిపోతుంది. ఒకవేళ అధికారం కోల్పోయిందా..ఇక ఆ పార్టీలో అంధకారం అలుముకుంటుంది. అప్పటిదాక అధికారం అనుభవించిన నేతలంతా పార్టీకి కష్టకాలంలో హ్యాండ్ ఇచ్చి అధికార పార్టీలోకి జంప్ అవుతారు. ఇక మాజీ అధికార పార్టీ నేతల అవినీతిపై కేసులు మొదలవుతాయి. వారిని ఇబ్బంది పెట్టడానికి అధికార పార్టీ వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఇదేరకంగా తయారైంది. వరుస షాకులతో ఆ పార్టీ రోజురోజుకూ కుదైలవుతోంది. ఇక తాజాగా కేటీఆర్ పై ఓ కేసు కూడా నమోదైంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై వరంగల్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి పై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయన్ను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు హనుమకొండ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, ఐపీసీ 504,500 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గురువారం కాంగ్రెస్ పార్టీ నేతలు హనుమకొండ సీఐ సతీశ్ కు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల నుంచి కేటీఆర్ సీఎంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లను కాంట్రాక్టర్లు, బిల్డర్ల దగ్గర వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని కేటీఆర్ లేనిపోని అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా మాట్లాడుతూ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ సీఎం లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరుతారని, సీఎం స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడడంతో పాటు తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ పై నిరాధార ఆరోపణలు చేయడంతో పాటు పరువుకు భంగం కలిగిస్తున్నందుకు కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇలాగే కొనసాగితే వారి పార్టీ గుర్తింపు రద్దుకు ఎన్నికల కమిషన్ ను కలిసి విన్నవిస్తామని స్పష్టం చేశారు.

TAGS