JAISW News Telugu

Jagan Protection : జగన్‌ రక్షణకే 986 మంది.. ఐదేళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకు రూ.296 కోట్లు

Jagan Protection

Jagan Protection

Jagan Protection : మాజీ సీఎం జగన్‌, ఆయన కుటుంబ భద్రతలో నిరంతరం ఎంతమంది పోలీసులు ఉండేవారో తెలిస్తే షాకవుతారు. పదీ, ఇరవై కాదు.. ఏకంగా 986 మంది. అంటే ఒక చిన్న ఊరి జనాభాతో సమానం. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఇళ్ల దగ్గర ఉండే భద్రతాసిబ్బంది కలిపినా ఇంతమంది ఉండరు. వీరికి ఒక్కొక్కరికి నెలకు సగటున రూ.50 వేల లెక్కన చూసినా ఐదేళ్లలో వారికి చెల్లించిన జీతాలే రూ.296 కోట్లు. దీంతో పాటు ఆయన రక్షణకు అత్యాధునిక పరికరాలు, ప్యాలెస్‌ చుట్టూ 30 అడుగుల ఇనుప గోడ, బుల్లెట్‌ ప్రూఫ్‌ క్రూయిజర్‌ వాహనాలు.. దేశంలో రాష్ట్రపతి, ప్రధానిలకు కూడా ఈ స్థాయి భద్రత ఉండదేమో. తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ ప్రతి షిఫ్టులో 310 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో కలిసి ఈ సంఖ్య 934మంది నిరంతరం గస్తీ కాస్తుంటారు. ఇదంతా జగన్ తన ఇంట్లో ఉన్నప్పుడే. బయటకు అడుగుపెడితే  ఈ సంఖ్య రెండు, మూడింతలు పెరుగుతుంది. కిలోమీటర్ల పొడవునా చెట్లు కొట్టేస్తారు. పరదాలు కడతారు. దుకాణాలు మూయిస్తారు. రాకపోకలు నిలిపేస్తారు. ఇక ఆయన ఇంటి చుట్టుపక్కల వాళ్లు, ఆ మార్గంలో ప్రయాణించే వారైతే ఐదేళ్లుగా నరకం చూస్తున్నారు. తమ ఇంటికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా గుర్తింపుకార్డులు మెడలో వేసుకుని తిరగాల్సిందే. అడుగడుగునా పోలీసులు ఆపుతుంటే.. వారికి రుజువులు చూపించాలి. ఇళ్లపై ఎగరేసే డ్రోన్ల ద్వారా వారి వ్యక్తిగత గోప్యతకు ఐదేళ్లు భంగం కలిగించారు. నిజమే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి భద్రత ఉండాల్సిందే. అయితే మరీ ఇంత భారీ స్థాయిలోనా ? అవసరానికి మించి ఉండాలా అనేదే ప్రశ్న.  

తాడేపల్లిలో జగన్‌ భద్రతకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ప్యాలెస్‌ చుట్టూనే కాదు ఉండవల్లి గుహలు, సీతానగరం, వారధి, ప్రకాశం బ్యారేజి సహా అడుగడుగునా చెక్‌పోస్టులే. ఒక్కోచోట 10 నుంచి 16 మంది గస్తీ కాస్తుంటారు. వీరు కాకుండా ట్రాఫిక్‌ విధుల్లో సుమారు 30 మంది సిబ్బంది ఉంటారు. సీఎం రక్షణలో నిమగ్నమయ్యే బాంబ్‌ స్క్వాడ్, యాంటీ నక్సల్‌ స్క్వాడ్‌ బృందాలు అదనం. వారు కాకుండా చెక్‌పోస్టులు, ఇతర బాధ్యతల్లో ఉండేవారు సిబ్బంది 555 మంది. గుంటూరు జిల్లా నుంచి ఎస్పీ ర్యాంకు అధికారితోపాటు ఏపీఎస్పీ బెటాలియన్స్‌ నుంచి ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు విధుల్లో ఉంటారు. మొత్తం 389 మంది భద్రతా సిబ్బందికి 50శాతం అదనపు భత్యం చెల్లిస్తున్నారు. దేశంలో మరే సీఎంనకు లేని స్థాయిలో జగన్‌కు ప్రభుత్వం రక్షణ కల్పించింది. దీని కోసం ఏపీ స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ యాక్ట్‌ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారు. కమాండో తరహాలో స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ) ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 379 మంది ఎస్‌ఎస్‌జీ సిబ్బంది నిరంతరం ఆయన భద్రతలో నిమగ్నమై ఉంటారు. టీడీపీ ప్రభుత్వం గతంలో ఉన్న భద్రత ఎంతమాత్రం తగ్గించలేదు.

Exit mobile version