Mukesh Kumar Meena : ఏపీలో 81 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని చోట్ల పోలింగ్ రాత్రి 2 గంటల వరకు కొనసాగిందని అన్నారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు 78.25 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 79.4 శాతం ఓటింగ్ నమోదైనట్లు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత పూర్తి వివరాలు వస్తాయన్నారు. సుమారు 81 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశముందని తెలిపారు.
2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైందని ఆయన గుర్తు చేశారు. 0.6 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం 79.8 శాతం నమోదైందని వివరించారు. కాగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో 86.87 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడ మొత్తం 2,36,409 ఓట్లకు గాను 2,05,369 ఓట్లు పోలయ్యాయి.