train collision : రైలు ఢీకొని 80 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, రెవెన్యూ అధికారుల తెలిపిన ప్రకారం.. లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు గొలగాని ఎర్నాయుడు, గొలగాని సింహాచలం, గొంప బంగారునాయుడు, ఆనందపురానికి చెందిన వారాది రమణమ్మ తమ గొర్రెల మందలను మంగళవారం జామి మండలంలోని భీమసింగి పంచాయతీ యాతపాలెం రైల్వే ట్రాక్ సమీపంలో మేత కోసం వదిలారు. ఇంతలోనే వాటిపై కుక్కలు దాడి చేయడంతో రైల్వే ట్రాక్ వైపునకు పారిపోయాయి. అదే సమయంలో విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ వాటిని ఢీకొనడంతో 80 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని, రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఘటనా స్థలాన్ని తాండ్రంగి పశువైద్యాధికారి గీతావాణి పరిశీలించి వివరాలు సేకరించారు