PM Modi : 75 రోజులు.. 180 ర్యాలీలు.. మోడీ 2024 ఎలక్షన్ ట్రాక్ రికార్డ్..  

PM Modi

PM Modi

PM Modi : అలుపెరగని నేత ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన ఏ కార్యం మొదలు పెట్టినా పూర్తయ్యే వరకు విశ్రమించరు. ప్రస్తుతం భారత్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి ఫేజ్ జూన్ 1న ముగుస్తుంది. ఆయా ఎంపీ స్థానంలో నిలబడే నేత తన షెడ్యూల్ పోలింగ్ ముగిసే వరకే  కష్టపడ్డాడు కానీ నరేంద్ర మోడీ మాత్రం అలుపెరగకుండా దాదాపు 75 రోజులు విశ్రాంతి లేకుండా శ్రమించారు.

లోక్‌సభ ఎన్నికలు జూన్‌ 1న చివరి విడతతో పూర్తవుతున్నాయి. ఈనేపథ్యంలో మే 30 సాయంత్రం వరకు ప్రచారం ముగుస్తుంది. హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న బీజేపీ ప్రచారంలోనూ దూకుడు ప్రదర్శించింది. ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఒక్కో రోజు 3 నుంచి 5 సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత నుంచి రెండున్నర నెలల్లో దాదాపు 180 ర్యాలీల్లో పాల్గొన్నారు.

ఒక్క మే లోనే 96 సభలు..
మార్చి 16, 2024న ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అప్పటి నుంచి బీజేపీ ప్రచార వేగాన్ని పెంచింది. అప్పటి నుంచి గురువారం (మే 30) వరకు 75 రోజుల్లో ప్రధాని దేశం నలుమూలలా ర్యాలీలు, రోడ్‌ షోలల్లో పాల్గొన్నారు. 22 రోజుల పాటు ప్రతీ రోజు 4 చోట్ల ప్రచారం చేపట్టారు. 3 పర్యాయాలు అయితే ఒక్క రోజులోనే ఐదు సభల్లో పాల్గొన్నారు. మేలోనే ప్రధాని 96 కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆ 4 రాష్ట్రాల్లో ఎక్కువ..
ప్రధాని ప్రచారాల్లో సగం ర్యాలీలు కేవలం 4 రాష్ట్రాల్లోనే ఉండడం గమనార్హం. 80 మంది ఎంపీలను ఎన్నుకునే ఉత్తరప్రదేశ్‌లో అధికంగా 31 సభలు నిర్వహించారు. ఆ తర్వాత బిహార్‌లో 20 ర్యాలీల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రలో 19, పశ్చిమ బెంగాల్‌లో 18 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2019తో పోలిస్తే మహరాష్ట్రలో ఈసారి రెట్టింపు ర్యాలీలు నిర్వహించారు. మొత్తంగా ఈ 4 రాష్ట్రాల్లో కలిపి 88 ర్యాలీలు చేపట్టారు.

దక్షిణాదిపై ప్రధాన దృష్టి..
దక్షిణాదిలో బలాన్ని పెంచుకోవాలని బీజేపీ ఏళ్ల తరబడి ఎదురు చూస్తోంది. ఈ సారి ఆ దిశగా వ్యూహాలు అమలు చేసింది. దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో ప్రధాని 35 ర్యాలీలు నిర్వహించారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 ప్రచార సభల్లో మోడీ పాల్గొన్నారు. గత ఎన్నికల్లో కర్ణాటకలో అత్యధిక సీట్లు దక్కించుకున్న బీజేపి.. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ఉండడంతో మరింత దృష్టి సారించింది.

మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో 5 ర్యాలీలు చేపట్టారు. నవీన్ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజు జనతా దళ్‌తో పొత్తు కుదరకపోవడంతో ఒడిశాపై కూడా బీజేపీ దృష్టి పెట్టింది. అక్కడ మోదీ 10 సభల్లో పాల్గొన్నారు. పూరీలో మోడీ చేపట్టిన భారీ రోడ్‌ షోలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

అటు మధ్యప్రదేశ్‌ 10, ఝార్ఖండ్‌ 7, రాజస్థాన్‌ 5, ఛత్తీస్‌గఢ్‌లో 4, హరియాణా 3 ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము-కశ్మీర్‌లోనూ ప్రధాని పర్యటించారు. ఇవేగాక, జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో మోదీ తన చివరి ప్రచారాన్ని పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో నిర్వహించారు. అది పూర్తి చేసుకొని ఈ సాయంత్రం కన్యాకుమారిలో ధ్యానానికి వెళ్లనున్నారు.

TAGS