707 years in Prison : చిన్నారుల పట్ల పాశవికంగా వ్యవహరించిన వ్యక్తికి కోర్టు భారీ శిక్ష విధించింది. ఏకంగా 707 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. చిన్నారులకు అశ్లీల చిత్రాల చూపడం, 17 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడడ్డాడని నమోదైన కేసులో ధర్మాసనం దోషిగా తేల్చింది. సదరు ముద్దయిపై నమోదైన మొత్తం 34 కేసులను పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది.
మాథ్యూ జెక్‌జెవ్స్కీ (34) బేబీ కేరింగ్ సేవలు నిర్వహించేవాడు. అయితే అతన్ని నమ్మి తల్లిదండ్రులు చిన్నారులను అప్పగించేవారు. వీరిలో 17 మంది చిన్నారులను లైంగికంగా వేధించాడు. 2014 నుంచి 2019 మధ్య ఇతడు నేరాలకు పాల్పడ్డాడు. వారికి అశ్లీల చిత్రాలు చూపించినట్లు కోర్టు తేల్చింది. వీరిలో 2 నుంచి 12 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఫిర్యాదు తర్వాత దేశం విడిచి వెళ్తుండగా పోలీసులు 17 మే, 2019లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుల్లో న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది.
మాథ్యూపై ఎలాంటి దయ చూపద్దని ఉరిశిక్ష విధించాలని బాధిత చిన్నారుల్లో ఇద్దరు పిల్లల నానమ్మ కోర్టును అభ్యర్థించింది. తమ పిల్లల కోసం ఇలాంటి రాక్షసుడిని నియమించుకున్నందుకు బాధ పడుతున్నామని ఆమె పేర్కొంది. మాథ్యూ లైంగికంగా వేధించడమే కాకుండా బయటకు చెప్పకుండా భయపెట్టేవాడని ఒక చిన్నారి తల్లి కోర్టుకు తెలిపింది.
కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాథ్యూ కనీసం క్షమాపణలు చెప్పలేదు. పైగా నవ్వుకుంటూనే వెళ్లడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగికంగా వేధించిన తను చిన్నారులకు ఆనందాన్నే పంచానని న్యాయమూర్తికి తెలిపారు. పైగా తాను చేసిన పనులను సమర్థించుకున్నాడు.