Air India Express : 70 ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు రద్దు – సిబ్బంది సిక్ లీవ్ కారణం

Air India Express

Air India Express

Air India Express : ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ 70కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది. విమానాల రద్దుకు సిబ్బంది అనారోగ్యంతో ఉండడమే కారణమని తెలిపింది. రద్దయిన విమానాల్లో దేశీయ, విదేశీ విమానాలు ఉన్నాయి. క్యాబిన్ సిబ్బందికి చెందిన కొంతమంది ఉద్యోగులు చివరి నిమిషంలో సిక్ లీవ్ తీసుకోవడంతో గత రాత్రి నుంచి విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

సిబ్బంది అనారోగ్యంగా ఉన్నారని దాంతో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సంస్థ తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ విధంగా స్పందించింది. ‘మా క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి చెందిన ఉద్యోగులు చివరి నిమిషంలో ఏకకాలంలో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు మూకుమ్మడిగా ‘సిక్ లీవ్’ దరఖాస్తులు అందాయి. దీంతో మంగళవారం రాత్రి నుంచి కొన్ని విమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. కొన్నింటిని రద్దు చేశాం. ఊహించని పరిణామం వల్ల ప్రయాణికులకు అంతరాయం కలిగినందుకు క్షమాపణలు కోరుతున్నాం’ అని తెలిపింది. రద్దయిన విమాన సర్వీసుల టికెట్ డబ్బులు వాపసు చేస్తామని, లేదంటే మరో తేదీకి రీషెడ్యూల్ చేసుకునే వీలుందని ఎయిర్ ఇండియా తెలిపింది.

TAGS