Animal : 11 రోజుల్లో 7 మరణాలు.. వామ్మో ఆ ప్రాంతాన్ని హడలెత్తించిన జంతువు..
రాజస్థాన్‌లో ఓ చిరుత హడలెత్తిస్తోంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఉదయ్‌పుర్ లోని ఓ గ్రామంలో ఆలయ పూజారిని చంపింది. అతడిపై దాడి చేసి చంపి అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకు పోయిందని చూసిన కొందరు చెప్పారు. సోమవారం (సెప్టెంబర్ 30) ఉదయం అటవీ ప్రాంతంలో పూజారి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఇలా 11 రోజుల్లో ఆ చిరుత ఏడుగురిని చంపింది.
గోగుండాలో విష్ణుగిరి (65) అనే పూజారి ఆలయ సమీపంలో నిద్రపోగా.. చిరుత దాడి చేసింది. సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. దాడి చేసిన ప్రదేశం నుంచి అతడి మృతదేహాన్ని చిరుత 150 మీటర్ల దూరం వరకు లాక్కెల్లినట్లు పోలీసులు గుర్తించారు.
చర్యలు చేపట్టినా..
ఈ ప్రాంతంలో చిరుతపులి దాడులు ఎక్కువ కావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దాడుల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీ అధికారులు అక్కడక్కడా బోన్లు పెట్టారు. అయినా అది వాటికి చిక్కడం లేదు. ఇతర చిరుతలు బోనులో పడుతున్నా అసలైన చిరుత మాత్రం చిక్కలేదని అధికారులు చెప్తున్నారు.
బయటకు రావద్దు..
చిరుత దాడులు పెరుగుతుండడంతో బయటకు వచ్చేందుకు స్థానికుల జంకుతున్నారు. ఆ ప్రాంతంలో పాఠశాలలు మూతపడ్డాయి. సాయంత్రం వేళ ప్రజలు బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరం అయితే గుంపులుగా రావాలని సూచించారు. కర్రలు లేదంటే ఇతర ఆయుధాలను వెంట తెచ్చుకోవాలని గ్రామస్తులను అధికారులు కోరారు. పోలీసులు, అధికారులు సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఒకే చిరుతేనా..?
ఈ దాడులకు తెగబడేది ఒకే చిరుతపులి అని ఓ అధికారి అన్నారు. అన్ని దాడుల్లో కూడా కదలికలు ఒకే రకంగా ఉన్నాయని.. దాడి స్వభావం ఒకేలా ఉన్నట్లు వివరించారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గమనిస్తున్నట్లు చెప్పారు.