Hyderabad : హైదరాబాద్ లో 618 గ్రాముల డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. హెరాయిన్ ను బెల్లం పాకంలో మరిగించి ఉండలుగా చేసి ఒక్కొక్కటి అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ రూరల్ సీఐ నరేంద్ర రెడ్డి తెలిపిన ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన అంబాలాల్ సుతార్ (54) అనే వ్యాపారి మూడేండ్ల కింద శంషాబాద్ వచ్చి ఊట్ పల్లి లో ఒకరి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. బిజినెస్ మ్యాన్ గా చెప్పుకుంటూ తిరిగే అంబాలాల్ డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో గత ఆదివారం రాత్రి అతడు ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేయగా డబ్బాల్లో ఉండలుగా ఉన్న పదార్థం కనబడింది. ఉండలన్నింటినీ కలిపి బరువు చూడగా 618 గ్రాములు ఉన్నాయి. అనుమానం వచ్చి టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపగా హెరాయిన్ అని తేలింది.
నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. హెరాయిన్ ను బెల్లం పాకంలో వేసి మరిగించినట్టు తెలిసింది. తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టి డబ్బాల్లో నిల్వ చేసి రోజుకొకటి చొప్పున అమ్ముతున్నట్లు తెలిపాడు. పట్టబడిన హెరాయిన్ విలు రూ.74 లక్షలు ఉంటుందని, కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ నరేందర్ రెడ్డి తెలిపారు.