Weather Alert : దేశంలో ఎండలు మండుతున్నాయి. పది రోజుల కిందట వర్షాల వల్ల కాస్త ఎండల తీవ్రత తగ్గింది. వారం రోజుల నుంచి భానుడి తన ప్రతాపాన్ని చూపుతుండడంతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణాదిలో సహజంగానే ఎండల తీవ్రత ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఉత్తరాదిలో సైతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.
తీవ్రమైన వడగాలులకు ఢిల్లీ సహ తూర్పు, మధ్య, ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో 54 మంది మృత్యువాత పడ్డారు. బిహార్ లో అత్యధికంగా 34 మంది మరణించారు. మృతిచెందిన ఓ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనట్లు వైద్యులు గుర్తించడం గమనార్హం. సాధారణ టెంపరేచర్ కంటే ఇది 10 డిగ్రీలు అత్యధికం. ఆయా రాష్ట్రాల్లో 45-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఐఎండీ తెలిపింది.
మరో కొన్ని రోజు పాటు పలు జిల్లాల్లో ఇవే పరిస్థితులు ఉంటాయని రాజస్థాన్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బ వంటి లక్షణాల కారణంగా అనారోగ్యానికి గురై చనిపోతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బార్మర్ లో 48.8 డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎండలు దంచడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఎండలు, వడగాలుల భయంతో ప్రజలు బయటకు రావడం లేదు. రాత్రివేళ కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. జనాలు తీవ్ర ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్నారు.