1975 Emergency : భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ..స్వేచ్ఛకు సంకెళ్లు పడిన రోజు.. భారత రాజ్యాంగ ప్రతిష్ఠకు బీటలు పడిన రోజు..ఎమర్జెన్సీకి సరిగ్గా నేటికి 49 ఏండ్లు నిండి, 50వ పడిలోకి వచ్చింది. 1975 జూన్ 25న ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని ప్రజాస్వామిక వాదులు మరిచిపోలేరు. ఎమర్జెన్సీని ప్రకటించిన తర్వాత 21 నెలల పాటు అమలులో ఉంది. 1977 జనవరి 18న ఎమర్జెన్సీని నిలిపివేసిన ఇందిరా గాంధీ అదే రోజు ఎన్నికలకు వెళ్తున్నామని వెల్లడించారు. దేశ ప్రజాస్వామ్యానికి పెద్ద కుదుపుగా నిలిచిన ఈ ఎమర్జెన్సీ విధింపు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ జైళ్లలో ఉన్న వారి సంఖ్య 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఖైదు చేయబడిన మొత్తం సంఖ్య కంటే చాలా ఎక్కువ అని చరిత్ర కారులు చెబుతుంటారు.
ఎమర్జెన్సీ ఎందుకు విధించాల్సి వచ్చింది?
పాకిస్తాన్ ను ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన ఇందిరాగాంధీ రాజకీయ ప్రభ దేదీప్యమానంగా వెలుగుతున్న రోజులవి. పేదల తల్లిగా దేశ ప్రజల మన్ననలు అందుకుంటున్న ఇందిరాకు దేశ రాజకీయాల్లో ఎదురులేని రోజులవి. దీంతో దేశమంటే నేనే.. నేనే దేశం..తాను చెప్పిందే వేదం..తాను చేసిందే త్యాగం అన్నట్టుగా ఇందిరా అహంకారపూరిత చర్యలు దిగారు.
ఇదే క్రమంలో 1974 జనవరిలో గుజరాత్ లో అప్పటి ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్‌ను తొలగించే లక్ష్యంతో గుజరాత్‌లో నవ నిర్మాణ్ ఉద్యమం అనే యువజన, విద్యార్థుల ఉద్యమం ప్రారంభమైంది. ఇందిరా గాంధీకి రెండుసార్లు ప్రధానమంత్రి రేసులో ఓడిపోయిన అనుభవజ్ఞుడైన నాయకుడు మొరార్జీ దేశాయ్, తన రాజకీయ ఆకాంక్షలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఒక అవకాశంగా భావించి ఆ ఉద్యమంలో చేరారు. దాదాపు అదే సమయంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మాజీ సహచరుడు జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో బీహార్‌లో ‘‘సంపూర్ణ విప్లవం’’ ఉద్యమం కోసం ఆందోళన కూడా జరిగింది.
జేపీ బీహార్‌తో తన ఉద్యమాన్ని ప్రారంభించి దేశవ్యాప్త ఆందోళనగా మార్చేశారు. జన్‌సంఘ్, కమ్యూనిస్టులతో సహా ప్రతిపక్షాలన్నీ తన ఉద్యమంలో చేరాలని పిలుపునిచ్చారు. జేపీ మొదటి లక్ష్యం ‘‘ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని పడగొట్టడం’’ మరియు కాంగ్రెస్‌ను అణిచివేసిన తర్వాత “పార్టీ రహిత ప్రజాస్వామ్యం” సృష్టించడం. 1975 ఫిబ్రవరి 15న జేపీ ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ఓ సమావేశం ఏర్పాటు చేసి అందులో ప్రసంగించారు. ఇందిరా నుంచి వచ్చే “చట్టవిరుద్ధమైన” ఆదేశాలను పాటించవద్దని సైన్యం, పోలీసులను కోరారు. ఓ వైపు మొరార్జీ దేశాయ్ గుజరాత్‌లో మార్చి 11న ‘‘ఆమరణ నిరాహార దీక్ష’’ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి కొత్తగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఒత్తిడి రావడంతో ఇందిరా గుజరాత్ అసెంబ్లీని రద్దు చేసి జూన్‌లో ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేపీ, మొరార్జీ దేశాయ్‌ల ఐదు పార్టీల కూటమి కాంగ్రెస్‌ను ఘోరంగా ఓడించింది.
అయితే 1971 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇందిరాగాంధీ ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డారని అలహాబాద్ హైకోర్టు జూన్ 12, 1975న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఎంపీగా ఇందిరా ఎన్నికను చెల్లుబాటు కాకుండా చేసింది. దీంతో పాటు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమెను నిషేధించింది. ఇది ఉత్తర భారతదేశం అంతటా విస్తృతమైన నిరసనలకు దారితీసింది. ఇందిరా గాంధీ రాజీనామా చేయాలనే డిమాండ్లతో జస్టిస్ జగ్‌మోహన్‌లాల్ సిన్హా ఆర్డర్ అప్పీల్‌కు వచ్చింది. రాజ్యాంగ న్యాయవాది నాని పాల్కివాలా ఈ తీర్పును సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. జూన్ 24న, సుప్రీంకోర్టు సెలవులో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ అలహాబాద్ తీర్పును షరతులతో కూడినదిగా ఉంచడానికి అనుమతించారు. ఇదేక్రమంలో ఇందిరా గాంధీ తన పదవికి రాజీనామా చేయాలని జేపీ, మొరార్జీ దేశాయ్ ఉద్యమాలను ఉధృతం చేశారు. దీంతో ఇందిరా గాంధీ 1975 జూన్ 25న అర్ధరాత్రి ఆకాశవాణి ద్వారా దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రాథమిక హక్కులను హరించి..
ఎమర్జెన్సీ కాలంలో కేంద్ర ప్రభుత్వం తన అత్యవసర అధికారాలను దుర్వినియోగం చేసింది. ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను, పత్రికల ప్రజాస్వామ్య హక్కులను రద్దు చేసింది. ప్రజలకు నిజాలు తెలియకుండా ఉండేందుకు వార్తాపత్రికల ఆఫీసులకు కరెంట్ ను నిలిపివేశారు. ‘‘ప్రెస్ సెన్సార్‌షిప్’’ ద్వారా, ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను తగ్గించింది. పత్రికను ప్రచురించే ముందు అనుమతి పొందడం తప్పనిసరి చేసింది. దేశంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కవాతులు, సమ్మెలు, ప్రజా అశాంతికి అనుమతి లేదు. ప్రభుత్వం నిరోధక నిర్బంధాన్ని దుర్వినియోగం చేసింది. ఇందిరాకు వ్యతిరేకంగా ఉద్యమించిన లక్షలాది మంది ప్రజలను చిత్రహింసలు పెట్టడమే కాకుండా వేలాది కస్టడీ హత్యలు జరిగాయి. పేదలను బలవంతంగా తాము ఉన్న చోటు నుంచి తొలగించడం, జనాభా నియంత్రణ కోసం నిర్బంధ స్టెరిలైజేషన్ విధించబడింది.
ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక హక్కులను తగ్గించడానికి రాజ్యాంగాన్ని సవరించింది. కానీ, కేశవానంద భారతి కేసులో రాజ్యాంగంలోని కొన్ని ప్రాథమిక లక్షణాలను సవరించలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో సుప్రీం కోర్టు నిర్ణయంపై కోపంగా ఉన్న ఇందిరా
చాలా మంది సీనియర్ న్యాయమూర్తులకు భవిష్యత్ లేకుండా చేయాలని వారి సీనియార్టీ ప్రాధాన్యతను తగ్గించారు. తనకు అనంగుడైన సీనియార్టీ లేని న్యాయమూర్తిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
ఇలా ఇందిరా గాంధీ అహంకారానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు బలంగా ఉద్యమించాయి. జేపీ, మొరార్జీ దేశాయ్, జనసంఘ్, కమ్యూనిస్టులు ఒక్కతాటిపై నడిచి ఇందిరా నిర్ణయాన్ని తీవ్రంగా నిరసించారు. చివరకు ఇందిరా గాంధీ దిగిరాక తప్పలేదు. అనేక రకాల ఆంక్షలకు కారణమైన ఎమర్జెన్సీని ముగిస్తూ..ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు 1977 జనవరి 18న ఇందిర ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి, 21న ఎమర్జెన్సీ ఎత్తివేశారు. ఆ ఎన్నికల్లో ప్రజలు ఇందిరా గాంధీని దారుణంగా ఓడించారు. జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు ఘన విజయం సాధించగా.. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.