KCR : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈసీ సీరియస్ అయింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది.
ఇటీవల రాజన్న సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఈ నిషేధం అమలులో ఉండనుంది.
ఎన్నికల సంఘం నిషేధం విధించడంపై కేసీఆర్ స్పందించారు. నా మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదు. తెలంగాణ మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్యలకు ఇంగ్లీష్ అనువాదం సరికాదు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించానని కేసీఆర్ పేర్కొన్నారు.