Kidney Stones : కాళ్లుచేతులు బాగున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అని పెద్దలు చెబుతుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఏకంగా 418 రాళ్లను వెనకేసుకున్నాడు. నాలుగు రాళ్లు వెనకేసుకోవడమంటే సంపాదన విషయంలో అని గుర్తుంచుకోవాలి. సదరు వ్యక్తి మాత్రం 418 రాళ్లను తన ఒంట్లో ఉంచుకున్నాడు. ఈ రాళ్లు అతడికి కిడ్నీ ఆపరేషన్ చేస్తే గాని బయటపడలేదనుకోండి. వీటిని చూసి డాక్టర్లే షాక్ అయ్యారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ సోమాజిగూడలోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి చేరాడు. 60 ఏండ్ల వయస్సున్న ఆ వ్యక్తి కిడ్నీ దెబ్బతినడం కారణంగా ఆస్పత్రిలో చేరినట్టు గుర్తించిన డాక్టర్లు.. వివిధ పరీక్షలు చేసి అతడి మూత్రపిండంలో పెద్ద సంఖ్యలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు.
దీంతో అతడికి చికిత్స చేసి రాళ్లు తొలగించాలని డాక్టర్లు పూర్ణచంద్రారెడ్డి, గోపాల్, దినేష్ నిర్ణయించారు. అయితే ఎటువంటి ఆపరేషన్ చేయకుండా, ఎలాంటి కోత లేకుండా కిడ్నీలో ఉన్న రాళ్లను బయటకు తీయాలని నిర్ణయించి పెర్క్యుటేనియస్ నెఫ్రోలితోటమీ విధానంలో మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో ఆపరేషన్ నిర్వహించారు.
చిన్న చిన్న రంధ్రాల ద్వారా లోపలకు సూక్ష్మ కెమెరాలను పంపి లేజర్ ప్రోబ్ ల ద్వారా రాళ్లను బయటకు తీశారు. మొత్తం ఆ వ్యక్తి కిడ్నీలో దాదాపు 418 రాళ్లు ఉన్నాయి. వీటిని తీయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. అనంతరం అతడి కిడ్నీ పనితీరు మెరుగుపడడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగుందని వైద్యులు చెప్పారు.