Holiday Maker Visa : ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన వర్కింగ్ హాలుడే మేకర్ వీసా కార్యక్రమం కింద అందుబాటులో ఉంచిన 1000 స్పాట్ లకు రెండు వారాల్లో 40 వేల మంది భారతీయులు దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా వలసల శాఖ సహాయమంత్రి తెలిపారు. ఈ వీసా పొందిన వారు ఆ దేశంలో 12 నెలల పాటు ఉండొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం చేయడానికి, చదువుకోవడానికి, లేదా నివాసం ఉండడానికి వారిని అనుమతిస్తారు. 18-30 ఏళ్ల వయసున్న భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా పొందిన వారు వచ్చే ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాకు వెళ్లవచ్చు.
డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం అఫైర్స్ ప్రకారం, వర్క్ అండ్ హాలుడే వీసా (సబ్ క్లాస్ 462) 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది. ఆస్ట్రేలియాలో ప్రయాణించడానికి మరియు పనిచేయడానకి వీలు కల్పిస్తుంది. దరఖాస్తుదారులు నాలుగు నెలల వరకు చదువుకోవచ్చు, దేశానికి అనేకసార్లు వెళ్లి తిరిగి ప్రవేశించవచ్చు. వారి ప్రయాణాలకు నిధులు సమకూర్చడానికి స్వల్పకాలిక ఉపాధిలో పాల్గొనవచ్చు.