Praja Bhavan : ప్రజాభవన్ లో మరుగుదొడ్ల రిపేర్ కు 35 లక్షలు? ‘‘కాంగ్రెస్ మొదలుపెట్టింది..’’ అంటూ నెటిజన్ల ట్వీట్స్..
Praja Bhavan : కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన నివాసంగా ఉన్న ప్రగతిభవన్ పై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించేవారు. అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ గడి బద్దలు కొడుతామని సవాల్ చేసేవారు. కేసీఆర్ తన విలాసాలకు ప్రగతిభవన్ కట్టుకున్నారని, ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించేవారు. ప్రగతిభవన్ ను స్టడీ సెంటర్ గా మారుస్తామని, లేదా ప్రభుత్వ దవాఖానగా మారుస్తామని అని ఆర్భాటంగా ప్రకటించేవారు.
ఇక మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రగతి భవన్ ను తన నివాసంగా మార్చుకున్నారు. తాజాగా ఆ భవనంలో మరమ్మతుల కోసం కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించేందుకు సిద్ధపడడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. భవన్ లో మరుగుదొడ్ల మరమ్మతుకు, జిమ్, గన్ మెన్ల గదుల కోసం భారీ ఎత్తున టెండర్లు పిలువడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరుపై ఎద్దేవా చేస్తున్నారు.
కేవలం మరుగుదొడ్ల మరమ్మతు కోసం రూ.35 లక్షలకు కాంగ్రెస్ టెండర్లను ఆహ్వానించడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దోమతెరల కోసం కూడా టెండర్లు ఆహ్వానించడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. జిమ్ రూంలో పొడుగు అద్దాలు, గన్ మెన్ ల గదుల కోసం రూ.28.70లక్షలకు టెండర్లు ఆహ్వానించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆ టెండర్లకు సంబంధించిన కాపీలు సోషల్ మీడియా వైరల్ అవుతుండడంతో సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాభవన్ లో తమ రాజకీయ విలాసాల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధపడిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదలుపెట్టింది’’ అంటూ పోస్టులు పెడుతున్నారు.