ACB Raid : పాలన చేసేది పాలకులే అయినా.. పాలనను నడిపించేది అధికారులే. పథకాల అమలు, ప్రజా సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలు.. ఇలా సర్వం అధికారుల చేతుల్లోనే ఉంటాయి. వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నా.. ఏదైనా సాంక్షన్ చేయాలన్నా.. అధికారుల సంతకమే కీలకం. దీంతో కొందరు అధికారులు అవినీతికి తెరతీస్తారు. లంచాలు మేసి కోట్లకు పడుగలెత్తుతారు. అవినీతికి ఆడ, మగ అనే తేడా ఉండదు. లంచం వస్తుందంటే ఒదులుకోరు. ఎంతటి అవినీతికైనా పాలుపడుతారు.
తాజాగా కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు పెద్దఎత్తున ఆస్తులు గుర్తించారు. నగదు, నగలతో పాటు స్థిరాస్తి పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటూ ఓ అధికారి చిక్కిన కేసులో ఇంత పెద్దమొత్తంలో ఆస్తులు పట్టుబడడం కలకలం రేపుతోంది.
నిజామాబాద్ లో పూర్తయిన పనికి బిల్లు చెల్లించడంతో పాటు గాజులరామారంలో జువైనల్ బాలుర వసతి గృహం నిర్మాణానికి సవరించిన అంచనాలు రూపొందించేందుకు లంచం డిమాండ్ చేసిన జగజ్యోతిని ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్న సంగతి తెలిసిందే. లంచంగా తీసుకుంటున్న రూ.84వేలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లోనూ సోదాలు జరిపారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకూ ఈ తనిఖీలు జరిగాయి. అధికారులు రూ.65,50,000 నగదు, రూ.1,51,08,175 విలువైన 3.639 కిలోల బంగారం, ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భూముల విలువ అంచనా వేయాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
సోదాలు జరుగుతుండగానే సోమవారం రాత్రి తనకు అస్వస్థతగా ఉందని జగజ్యోతి చెప్పడంతో ఏసీబీ అధికారులు ఆమెను హుటాహుటిన ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఆమెకు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. బుధవారం ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేయనున్నారు. ఆ తర్వాత రిమాండ్ కు తరలించనున్నారు.