KCR-Congress MLAs : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మంచి మాటకారి అని మనకు తెలిసిందే. గతంలో ఆయన ప్రెస్ మీట్లను, ఇంటర్వ్యూలను జనాలు చెవులురిక్కించి మరి వినేవారు. ఆయన ఇంటర్వ్యూలు చాలా ఆసక్తికరంగా సాగేవి. ఉద్యమ నేతగా ఉన్నప్పుడు చాలా ఇంటర్వ్యూలే ఇచ్చినా పదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రెస్ మీట్లు పెట్టడమే తప్ప పెద్దగా ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఏర్పడింది. ఈక్రమంలో కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఈమేరకు తాజాగా ఓ ప్రముఖ మీడియా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బయట పలువురు చెబుతుంటే రేవంత్ రెడ్డి ఖండించడం లేదన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలోనే చాలా అనిశ్చితి ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లలో కొంతమంది ఎమ్మెల్యేలు తమ నేతలను సంప్రదిస్తున్నారని తెలిపారు. 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారన్నారు. అందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని వాళ్లే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. మా వాళ్లతో ఆ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. కానీ తాము మాత్రం ఆ విషయంపై ఇంకా చర్చించలేదన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను మళ్లీ సీఎం అవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఈసారి గెలిస్తే ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు. ప్రజలు భ్రమలో పడి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లు తమ రివ్యూలో తేలిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పదన్నారు. బీఆర్ఎస్ 8 నుంచి 12 సీట్లు గెలవబోతుందని జోస్యం చెప్పారు. బీజేపీకి సున్నా నుంచి 1 స్థానం మాత్రమే వస్తుందన్నారు.