Somesh Kumar : తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గుర్తున్నారు కదా.. ఆయన ట్రాక్ రికార్డ్ సరిగా లేకున్నా మాజీ సీఎం కేసీఆర్ ఆయనను అందలం ఎక్కించారు. ఆయన చేసిన ఓ నిర్వాకం సంచలనం రేపుతోంది. సోమేశ్ కుమార్ భార్య డాగ్యన్ముద్రకు రంగారెడ్డి జిల్లాలో స్థలం ఉంది. ఎకరమో, రెండు ఎకరాలో కాదు..ఏకంగా 25 ఎకరాలు.
యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో ఈ భూమి ఉంది. ఇక్కడ ఎకరా భూమి విలువ రూ.3 కోట్లుగా ఉంది. అంటే ఆ భూమి విలువ రూ.75 కోట్లు. అయితే ఈ భూమి ఎలా వచ్చిందో తెలియడం లేదు. డాగ్యన్ముద్రకు ఖాతా నంబర్ 5237లో సర్వే నం. 249/ఆ1 లో 8 ఎకరాలు, 249/ ఆ2 లో 10 ఎకరాలు, 260/ఆ/1/1లో 7.19 ఎకరాల భూమి ఉంది. ధరణి పోర్టల్ లో ఖాతా నంబర్ కూడా ఉంది.
ఖాతా నంబర్ 5237 అనే నంబర్ ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ఈ భూములను సేల్ డీడ్ ద్వారా కొనలేదు. సాదాభైనామా ద్వారా కొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్ లో ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ కోసం చెక్ చేస్తే కనిపించడం లేదని సమాచారం. దీంతో ఈ భూమి అక్రమంగా వచ్చిందంటూ ఆరోపణలు వస్తున్నాయి.
లంచాలు, భూములతో అక్రమంగా సంపాదించిన రెరా సెక్రటరీ బాలకృష్ణ ఉన్న సమయంలో సోమేశ్ కుమార్ చైర్మన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడే యాచారంలో 25 ఎకరాలు సోమేశ్ భార్య పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. ఈ భూమికి సంబంధించిన ఆధారాలను ఏసీబీ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సరైన పద్ధతిలోనే భూమిని కొనుగోలు చేశానని సోమేశ్ చెపుతున్నారు. తనకున్న ఇళ్లు అమ్మి స్థలం కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ దీనిపై విచారణ చేయాలని ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తున్నారు.