Olympics in India : ప్రపంచంలో అత్యున్నత క్రీడావేదిక ‘ఒలింపిక్స్’ని భారత్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. భారత ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓఏ) 2036లో భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి అధికారికంగా ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని పంపింది. ఒలింపిక్స్ ని నిర్వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. 2036లో పారాలింపిక్స్ క్రీడలు జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2036లో భారత్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే ప్రధాని నరేంద్ర మోదీ కలలకు ఇది అద్దం పడుతోంది.
గత ఏడాది ముంబైలో జరిగిన 141వ ఐఓసీ సమావేశంలో 140 కోట్ల మంది భారతీయులు క్రీడలను నిర్వహించడానికి కట్టుబడి ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల చిరకాల స్వప్నంగా ఆయన అభివర్ణించారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ థామస్ బాచ్ కూడా భారత్ ఆసక్తిని సమర్థించారు.
అయితే, 2036 ఒలింపిక్ క్రీడల్ని నిర్వహించడానికి భారత్ తో పాటు మరో 10 దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. మెక్సికో (మెక్సికో సిటీ), గ్వాడలజారా-మాంటెర్రే-టిజువానా, ఇండోనేషియా (నుసంతారా), టర్కీ (ఇస్తాంబుల్), ఇండియా (అహ్మదాబాద్), పోలాండ్ (వార్సా, క్రాకో), ఈజిప్ట్ (కొత్త అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్) మరియు దక్షిణ కొరియా (సియోల్-ఇంచియాన్) పోటీలో ఉన్నాయి.