2024 sankrathi:స్పెషల్ స్టోరి..2024 సంక్రాంతి పందెంలో తగ్గేదేలే!
2024 sankrathi:2024సంక్రాంతి బరిలో పందెం పుంజులు నువ్వా నేనా? అంటూ రెడీ అవుతున్నాయి. థియేటర్ల విషయంలో ఎవరికి వారు బెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. పోటీబరిలో పెద్ద సినిమా ఉన్నా తగ్గేదేలే అంటూ యువహీరోల సినిమాలు దూసుకొస్తున్నాయి. రిలీజ్ తేదీల మార్పుపై ఎవరూ ఆలోచించడం లేదని గుసగుస వినిపిస్తోంది. పండగ బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న `గుంటూరు కారం`తో పాటు, యువ నటుడు తేజ సజ్జ నటిస్తోన్న హనుమాన్ ఒకే రోజున అంటే జనవరి 12న విడుదలవుతోంది. మహేష్ తో పోటీ అని అనలేం కానీ, ఒక యువహీరో సినిమాని గట్సీగా రిలీజ్ చేస్తున్నారనడంలో సందేహం లేదు.
ఇక మాస్ మహా రాజా రవితేజ నటిస్తోన్న ఈగిల్.. విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న సైంధవ్ తో పోటీపడుతూ జనవరి 13న రిలీజ్ అవుతోంది. అగ్ర హీరోల నడుమ వార్ ఖాయమైంది. వీటితో పాటు ఇంకొన్ని చిన్న సినిమాలు.. డబ్బింగ్ సినిమాలు కూడా అప్పటికీ రెడీ అవుతున్నాయని తెలిసింది. అయితే ప్రధానంగా రెండు రోజుల్లోనే నాలుగు సినిమాలు రిలీజవుతుండటంతో థియేటర్ల సర్దుబాటు కొంత ఇబ్బందికరం అని విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య మునుపటితో పోలిస్తే తగ్గింది. దానికి తోడు స్టార్ హీరోల సినిమాలను మెజారిటీ థియేటర్లలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. హీరోలంతా సంక్రాంతి సెలవులనే టార్గెట్ చేయడంతో థియేటర్లు సర్దుబాటు అతికష్టంగా మారినట్లు కనిపిస్తోంది. పండగ సీజన్‌లో ఏ హీరో కూడా వెనక్కి తగ్గడానికి ఒప్పుకోవడం లేదని తెలిసింది.
థియేటర్ల సర్దుబాటుకి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుకున్నా అది ఓ కొలిక్కి రాలేదని సమాచారం. న్యూఇయర్ కానుకగా జనవరి -1న ఏదో ఒక సినిమాని రిలీజ్ చేసుకోవచ్చని సలహా ఇచ్చినా ఎవరూ వినడం లేదుట. ఫలానా చిత్రం అంటూ మెన్షన్ చేయకుండా ఎవరో ఒకరు తగ్గి ముందుకొస్తే సర్దుబాటుకి వీలుంటుందని పెద్దలు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ సమావేశంలో ఎవరికి వారు తాము పట్టిన కందేటికి మూడే కాళ్లు అన్నచందంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
దిల్ రాజు..నాగవంశీ..డి.సురేష్ బాబు..విశ్వప్రసాద్ లాంటి సినీపెద్దలు రాయబారాలు నెరుపుతున్నా అంతిమంగా ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. రిలీజ్ డేట్ మారడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. సెలవుల సీజన్ కాబట్టి టాక్ ఎలా ఉన్నా ఓవర్ ప్లోలో పక్క సినిమాకి మళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ఇప్పటికిప్పుడు థియేటర్ల సర్ధుబాటు విషయమై నిర్మాతలు పంతం వీడే పరిస్థితి లేదట. అంతా ఒకటే పట్టు మీద ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడే కొత్త కాదు. రిలీజ్ ముందు వరకూ ఎవరూ వెనక్కి తగ్గరు. రిలీజ్ దగ్గరపడే సరికి సర్దుబాటుకు ఆస్కారం దొరుకుతుందని ఒక సెక్షన్ విశ్లేషిస్తోంది. సంక్రాంతి వార్ లో ట్విస్టులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.