2023 Rewind:2023కి మరి కొద్ది రోజుల్లో వీడ్కోలు పలుకుతూ న్యూ ఇయర్ 2024కు వెల్కమ్ చెప్పబోతున్నాం. కొత్త ఏడాదికి మరో ఇరవై రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అగ్ర కథానలకుల పరిస్థితేంటీ?..వారి సినిమాలు ఏ స్థాయిలో ఆకట్టుకున్నాయి. ఎంత మంది తమ అభిమానుల్ని ఆనందపరిచారు?..ఎంత మంది నిరాశ పరిచారు? .. ఎవరెవరు ఈ ఏడాది సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేశారు? ..ఇందులో ఎంత మంది స్టార్స్ విఫలమయ్యారు?..ఎవరు సక్సెస్ అయ్యారు? అన్నది ఒక సారి చూద్దాం.
సంక్రాంతి నుంచే అసలు ఆట మొదలైంది..
ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల నిర్మాణం జరిగినా.. థియేటర్లలోకి ఎన్ని క్రేజీ మూవీస్ విడుదలైనా అగ్ర కథానాయకుల సినిమా బాక్సాఫీస్ వద్ద చేసే సందడే వేరు. థియేటర్లకు జనాలని రప్పించాలన్నా… బాక్సులు బద్దలు కొట్టాలన్నా.. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టాలన్నా అగ్ర కథానాయకుల సినిమాలు బరిలోకి దిగాల్సిందే. అప్పుడే బాక్సాఫీస్ కళకళలాడుతుంది. కాసుల వర్షం కురుస్తుంది. ఈ ఏడాది ఇండస్ట్రీకి శుభారంభాన్నిఅగ్ర కథానాయకులే అందించారు. ముందుగా సంక్రాంతి బరిలో నిలిచిన అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ. ఫ్యామిలీ ఫ్యాక్షన్ డ్రామా `వీరసింహారెడ్డి`తో జనవరి 12న బరిలోకి దిగిన బాలయ్య మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి శుభారంభాన్ని అందించారు.
ద్వితీయార్థంలోనూ అదే జోరుని ప్రదర్శిస్తూ `భగవంత్ కేసరి` సినిమాతో దసరా బరిలో నిలిచి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇదే ఉత్సాహంతో ప్రస్తుతం తన 109వ చిత్రాన్ని పట్టాలెక్కించారు. బాలయ్య తరువాత బరిలో నిలిచిన అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి బరిలో `వాల్తేరు వీరయ్య`గా ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా రికార్డు స్థాయి వసూళ్లని దక్కించుకున్నారు. అయితే ద్వితీయార్థంలో మాత్రం బాలయ్య తరహాలో మరో సక్సెస్‌ని దక్కించుకోలేకపోయారు. ఆయన నటించిన `భోళా శంకర్` చేదు ఫలితాన్ని అందించి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్‌ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఓ సోషియో ఫాంటసీ కథతో భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు. `మెగా 156` అనే వర్కింగ్ టైటిల్‌తో `బింబిసార` ఫేమ్ యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిరాశ పరిచిన క్రేజీ స్టార్స్…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పక్క సినిమాల్లో నిటిస్తూనే మరో పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ ఏడాది వరుస సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా గడిపారు. అయితే సెట్స్‌పై నాలుగు సినిమాలు ఉన్నా ఒకే ఒక్క సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చారు. అదే విలక్షణ నటుడు సముద్రఖని రూపొందించిన `బ్రో`. మంచి పాయింట్‌తో రూపొందినా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేక తీవ్ర నిరాశకు గురి చేసింది. పవన్ ప్రస్తుతం `ఓజీ`, `ఉస్తాద్ భగత్‌సింగ్`, `హరి హర వీరమల్లు` చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.
ఇక బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన మరో హీరో మాస్ మహారాజా రవితేజ. ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`లో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకున్న రవితేజ ఆ తరువాత చేసిన `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలతో నిరుత్సాహానికి గురి చేశారు. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ `ఈగల్`లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్టార్ క్రేజ్ కానీ…
`బాహుబలి` సిరీస్ సినిమాలతో భారతీయ సినిమా స్వరూపాన్నే సమూలంగా మార్చేసి పాన్ ఇండియా స్టార్‌గా మారిన హీరో ప్రభాస్. తన నుంచి సినిమా వస్తోందంటే అంచనాలు మామూలుగా ఉండటం లేదు. దేశ వ్యాప్తంగా ప్రభాస్ సినిమా అంటే భారీ క్రేజ్ ఏర్పడుతోంది. దీంతో ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడంలో ప్రభాస్ తడబడుతున్నారు. గత ఏడాది `రాధేశ్యామ్`తో ప్రేక్షకుల ముందుకొచ్చి నిరాశ పరిచిన ప్రభాస్ ఈ ఏడాది ద్వితీయార్థంలో `ఆదిపురుష్`తో వచ్చారు. తొలి సారి శ్రీరాముడిగా నటించడంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా కార్టూన్ మూవీలా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తడం, బాక్సాఫీస్ వద్ద డిజాసర్ట్ అనిపించుకోవడం తెలిసిందే.
`ఆదిపురుష్` తరువాత ఈ ఏడాది ప్రభాస్ `సలార్` సినిమాతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. `కేజీఎఫ్` సిరీస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్‌లని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. టీజర్, ట్రైలర్‌లతో ఇప్పటికే అంచనాలు పెంచేసిన `సలార్` డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కాబోతోంది. దీంతో మళ్లీ ప్రభాస్ సక్సెస్ బాట పడతారని అభిమానులు గట్టి నమ్మకంతో చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ `కల్కి2898ఏడీ`, మారుతి డైరెక్షన్‌లో కామెడీ హారర్ థ్రిల్లర్ చేస్తున్నారు.