Prabhas Salaar:ఈ క్రిస్మస్ బరిలో షారూఖ్ ఖాన్ డంకీ, ప్రభాస్ సలార్ బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టిన సంగతి తెలిసిందే. అయితే క్రిస్మస్ విన్నర్ ఎవరు? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. అయితే తొలి నుంచి డంకీతో వార్ లో సలార్ పైచేయి చూపిస్తూనే ఉంది. తాజాగా అందిన నాలుగు రోజుల వసూళ్ల రిపోర్ట్ తో ఈ క్రిస్మస్ కి బాక్సాఫీస్ బాద్ షా ప్రభాస్ అని డిక్లేర్ అయింది. ప్రభాస్ సలార్ దాదాపు 295కోట్ల వసూళ్లను సాధించి రేస్ లో ఖాన్ డంకీని వెనక్కి నెట్టింది.
ప్రభాస్ సినిమా సలార్ కు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. సలార్ ఓపెనింగ్ డే భారీ వసూళ్లు రాబట్టింది. తొలిరోజే రూ.90.7 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది ఈ చిత్రం. రెండో రోజు కూడా ఈ చిత్రం తుఫానులా వసూళ్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా 295.7 కోట్ల రూపాయల భారీ వసూళ్లను రాబట్టింది. మూడో రోజు కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రూ.53.86 కోట్ల వసూళ్లు తెచ్చింది. మూడు రోజుల్లో అద్భుతమైన వసూళ్లు సాధించిన తర్వాత, సలార్ చిత్రం సోమవారం పరీక్షలో కూడా మొదటి గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించింది.
సోమవారం అయినప్పటికీ ఈ సినిమా రూ.35-40 కోట్ల వసూళ్లను తెచ్చినట్టు లెక్కలు వచ్చాయి. క్రిస్మస్ పండుగ కావడంతో సినిమా చూసేందుకు జనం పెద్ద ఎత్తున థియేటర్లకు చేరుకున్నారు. ఈ లెక్కలు కరెక్ట్ అయితే సినిమా టోటల్ కలెక్షన్ లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. తుది లెక్కల కోసం వేచి చూడాల్సిందే. ట్రేడ్ వివరాలు వెల్లడైతే ఈ సంఖ్య లైట్ గా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
డంకీ బాక్సాఫీస్ పరిస్థితేంటి?
షారూఖ్ డంకీ, ప్రభాస్ సలార్ ఒక రోజు తేడాతో విడుదలయ్యాయి. అయితే డంకీకి యావరేజ్ టాక్ రావడం, సలార్ కి హిట్ టాక్ రావడంతో ఈ ప్రభావం డంకీపై పడింది. డంకీ 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టడానికి నాలుగు రోజులు పట్టింది. ఖాన్ సినిమాకి ఈ వసూళ్లు చాలా తక్కువ. సలార్ ప్రభంజనం ముందు డంకీ చేతులెత్తేసిందనేది ఒక రిపోర్ట్. డంకీ చిత్రం మొదటిరోజు కేవలం 29.2 కోట్ల రూపాయల ఓపెనింగ్‌ను మాత్రమే రాబట్టింది. అయితే డంకీ చిత్రాన్ని కేవలం 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో హిరాణీ తెరకెక్కించారు. ఈ సినిమాకి నష్టాలు వచ్చేందుకు ఆస్కారం లేదు. అయితే థియేటర్ల నుంచి ఏమేరకు వసూలు చేస్తుందనేది వేచి చూడాలి.