Karimnagar District : ఒక్కో బస్సులో 200 మంది ‘ఆదర్శ’ విద్యార్థులు
Karimnagar District : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని న్యాలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో 750 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా పాఠశాలకు రావడానికి గతంలో రెండు బస్సులు నడిచేవి. అయితే గత కొంత కాలంగా ఆర్టీసీ ఒక్క బస్సునే కేటాయించింది. దీంతో రెండు బస్సుల్లో రావలసిన విద్యార్థులు ఒకే బస్సులో ప్రయాణిస్తున్నారు. అలా ఒక్క బస్సులోనే ఒకేసారి 200 మంది విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు.
ఈ పాఠశాలకు వెళ్లే గట్టుబూత్కూర్-గర్శకుర్తి రూట్ లో గతంలో విద్యార్థుల కోసం రెండు ఆర్టీసీ బస్సులు నడిపేవారు. ప్రస్తుతం ఒకే బస్సు నడుస్తుండడంతో దాదాపు 200 మంది విద్యార్థులు ఒకేసారి ప్రయాణించాల్సి వస్తోంది. గట్టుబూత్కూర్ నుంచి పాఠశాలకు 18 కి.మీ. దూరం ఉంది. కాచిరెడ్డిపల్లి రూట్ లో ఉదయం పూట ఒకే బస్సు రెండు ట్రిప్పుల్లో విద్యార్థులను చేరవేస్తుండగా, సాయంత్ర మాత్రం ఒక్క ట్రిప్పుతోనే సరిపెడుతున్నారు. దీంతో ఒకేసారి 200 మంది విద్యార్థులు ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కాచిరెడ్డపల్లి నుంచి న్యాలకొండపల్లికి 16 కి.మీ. దూరం ఉంది. బస్సుల్లో ఖాళీ లేక కొందరు విద్యార్థులు గంగాధర, మధురానగర్ నుంచి సుమారు 7 కి.మీ. కాలినడకన వెళ్తున్నారు.