Kirana stores : 2 లక్షల కిరాణా స్టోర్లు మూత.. ఏడాదిలో ఇంత ఘోరం.. కారణం ఇవేనట..?
kirana stores closed : ఇంట్లో ఉండి సెల్ మీట నొక్కితే చాలు ఏది కావాలన్నా కాళ్లకాడికి రావాల్సిందే. ఐదు రూపాయల చిప్స్ ప్యాకెట్ నుంచి బియ్యం బస్తా వరకు అన్ని ఒక్క క్లిక్ తో ఇంటికి వస్తున్నాయి. దీనికి తోడు భారీ ఆఫర్లతో అవెలబుల్ గా ఉంటున్నాయి. దీంతో గల్లీలోని కిరాణా దుకాణానికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. క్విక్ కామర్స్ దెబ్బకు చిన్నపాటి కిరాణా దుకాణాలు పత్తా లేకుండా పోయాయి. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPDF) లెక్కల ప్రకారం.. మెట్రో, టైర్-1 సిటీల్లో 2 లక్షలకు పైగా దుకాణాలు మూతపడ్డాయని చెప్తోంది. టైర్-1 సిటీల్లో క్విక్ కామర్స్ మరింత వేగం పుంజుకుందని తెలిపింది. తక్కువ సమయం హోం డెలివరీ, ఆఫర్లు, కావాల్సిన వస్తువులు ఇలా అన్నీ ఉండడంతో కస్టమర్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఏఐసీపీడీఎఫ్ పేర్కొంది. ఇలానే కొనసాగితే కిరాణా షాపులు అనే పదం పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుందని మధ్య, దిగువ తరగతి వ్యాపారులు వాపోతున్నారు.