liquor : ఏనాడో సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో 19వ శతాబ్దం నాటి ఖరీదైన మద్యం ఉన్నట్లు గుర్తించారు. దీంతో దానిని బయటకు తీయడానికి ఎవరూ ప్రయత్నించవద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. దక్షిణ స్వీడన్ సముద్ర తీరంలో మునిగిపోయిన ఓడ శిథిలాల్లో 19వ శతాబ్దానికి చెందిన దాదాపు వంద బాటిళ్ల షాంపైన్, మినరల్ వాటర్ సీసాలను కనుగొన్నారు. ఈ ఓడను 2016లోనే గుర్తించినప్పటికీ, గత నెలలో పోలండ్ కు చెందిన స్కూబా డైవర్లు ఆ ఓడలోకి వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జూలై 11న పోలండ్ స్కూబా డైవర్లు అందులోని షాంపైన్, మినరల్ వాటర్ బాటిల్లు ఉన్నట్లు కనుగొన్నారు. పురాతనమైన ఈ మద్యాన్ని పరీక్షించేందుకు స్కూబా డైవర్లపై నిపుణులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో 1850 ప్రాంతానికి చెందినదిగా భావిస్తున్న మునిగిపోయిన నౌకను ‘పురాతన అవశేషం’గా స్వీడన్ అధికారులు ప్రకటించారు. దీంతో మద్యం బయటకు తీయడం కుదరదని స్పష్టం చేశారు.