Anna Canteens : అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు రూ.189 కోట్లు.. ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు

Anna Canteens
Anna Canteens : అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను స్వీకరించిన వెంటనే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైలుపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. త్వరితగతిన అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రూ.189 కోట్లు అవసరమని మున్సిపల్ శాఖ అంచనా వేసి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలను పంపింది.
ఆర్థిక శాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం రాగానే పనులు ప్రారంభించి త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో 183 క్యాంటీన్ల పునరుద్ధరణకు రూ.189.22 కోట్లు అవసరమని ఇంజనీర్లు అంచనా వేసి ఆర్థిక శాఖకు నిధుల కోసం ప్రతిపాదించారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. అన్న క్యాంటీన్లలో రూ.5 లకే భోజనం అందించనున్నారు.