Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించింది. అందులో భాగంగా సోమవారం ఉదయం ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో జరిగిన ఓ చిన్న తప్పిదం కారణంగా రామ్ నివాస్ రావత్ రెండుసార్లు మంత్రిగా ప్రమాణం చేయవలసి వచ్చింది. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరగడం గమనార్హం. రామ్ నివాస్ రావత్ కాంగ్రెస్ తరపున పోటీచేసి షియోపుర్ జిల్లాలోని విజయ్ పుర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆయన బీజేపీలో చేరారు. తాజాగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు.
నేటి ఉదయం రావత్ తో గవర్నర్ మంగుభాయ్ సీ పటేల్ మంత్రిగా ప్రమాణం చేయించారు. ఆ సమయంలో రావత్ ‘రాజ్య మంత్రి’ (రాష్ట్ర మంత్రి)కి బదులు ‘రాజ్యా కే మంత్రి’ (సహాయ మంత్రి) అని పొరబాటున చదివారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. అలా ఆ ప్రమాణాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం 15 నిమిషాలకే రాష్ట్ర మంత్రిగా మరోసారి ప్రమాణం చేశారు.
కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సీనియర్ నేత రామ్ నివాస్ రావత్ ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీలో చేరి నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఇది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.