Vikarabad Collector : వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో 15 మంది అరెస్టు

Vikarabad Collector
Vikarabad Collector : వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి కేసులో 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, దుద్యాల, కొడంగల్, బొంరాస్ పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. లగచర్లలో పోలీసులను మోహరించారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం లచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేశారు. ఫార్మాసిటీకి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని గ్రామస్థులు కలెక్టర్ సహా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడిచేశారు. ఈ దాడి నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ తప్పించుకున్నారు. కలెక్టర్, అధికారుల కార్లను రైతులు ధ్వంసం చేశారు.
ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డిపై కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకున్న వెంకట్ రెడ్డి పొలాల వెంట పరుగులు పెట్టారు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డపైనా రైతులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో దాడికి పాల్పడిన 55 మందిని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.