Prajwal Revanna : లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Prajwal Revanna : మహిళలపై లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (ఎసిఎంఎం) కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రజ్వల్ రేవణ్ణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కస్టడీ జూన్ 10వ తేదీ సోమవారంతో ముగిసింది. ఈ క్రమంలో అతన్ని అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో రేవణ్ణను ఇంకా విచారించాల్సి ఉందని, అతని కస్టడీని పొడిగించాలని సిట్ కోర్టును కోరింది. దీంతో ప్రజ్వల్ రేవణ్ణకు ఎసిఎంఎం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి విధించింది.
మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ.. హోలెనరసీపూర్ పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్, అత్యాచారం కేసులోఅరెస్టయ్యాడు. అతనిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలనై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రెండో నిందితుడిగా ఉన్న ఆయన తండ్రి, జేడీ (ఎస్) ఎమ్మెల్యే హెచ్ డీ రేవణ్ణ మొదట అరెస్టు అయ్యారు. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ పై ఆయన విడుదల అయ్యారు.