12th Fail : దేశవ్యాప్తంగా ‘12th ఫెయిల్’ మూవీకి లక్షలాది మంది ఆదరణ చూరగొంటోంది. ఈ సినిమాను చూసేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక యువత ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ఉద్యోగార్థులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ అయిన ఉత్తమ చిత్రాల్లో, ప్రతీ ఒక్కరూ చూసే సినిమా లిస్ట్ లో ఈ సినిమాదే తొలి స్థానం అని చెప్పాలి.
ఈ సినిమా ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ రియల్ హీరో మరోసారి హీరోగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఉత్తమ సేవా పతకాన్ని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు స్వీకరించనున్న 34 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిలో ఆయన ఒకరు కావడం విశేషం.
మనోజ్ కుమార్ శర్మ 2005 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. మహారాష్ట్ర క్యాడర్ కు చెందినవారు. ఈయన భార్య శ్రద్ధా జోషి ఐఆర్ఎస్ అధికారి. మధ్యప్రదేశ్ లోని ఓ చిన్న గ్రామానికి చెందిన మనోజ్.. బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. సరైన విద్యా వసతులు లేని కారణంగా 12వ తరగతి ఫెయిల్ అయ్యాడు. అయినప్పటికీ ఐపీఎస్ సాధించాలనే లక్ష్యంతో డిగ్రీ పట్టాపొందారు. ఆ తర్వాత యూపీఎస్సీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వరుసగా మూడు సార్లు విఫలమై చివరకు తన లక్ష్యాన్ని సాధించారు. ఆయన విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రద్ధాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ కథను శర్మ స్నేహితుడు అనురాగ్ పాఠక్ నవలగా మలిచారు. అదెంతో ప్రాచుర్యం పొందింది. దీని ఆధారంగా విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో ట్వెల్త్ ఫెయిల్ తీశారు. ఇది దేశంలో ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.