Earning 1 crore : విజయవంతమైన పారిశ్రామికవేత్త అవ్వడం చాలా కష్టం. కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ పాప పదేళ్లకే ఆ క్రెడిట్ సాధించింది. పేరు పిక్సీ కర్టిస్. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ చేస్తోంది. తన కూతురిని చూసి మురిసిపోతున్న తల్లి రాక్సీ జాసెంకో… 15 ఏళ్లకే పిక్సీ రిటైర్మెంట్ తీసుకుంటుందని ప్రకటించింది. ఆ రేంజ్‌లో ఆ పాప వ్యాపారం సాగుతోంది. తన కూతురిని ఓ వ్యాపారవేత్తగా చూడాలి అనుకున్న తల్లి… చిన్నప్పుడే ఆ దిశగా అడుగులు వేయించింది. కూతురు పుట్టగానే ఆమె పేరు మీద 2011లో పిక్సీస్ బౌస్ అనే వ్యాపారం ప్రారంభించింది. ఆ తర్వాత పిక్సీస్ ఫిడ్‌జెట్స్ అనే మరో వ్యాపారం కూడా ప్రారంభించింది. ఇప్పుడు ఇవి విజయవంతంగా సాగుతున్నాయి. 2030 నాటికి వీటి ద్వారా నెలకు రూ.15 కోట్ల ఆదాయం వస్తుందని రాక్సీ అంచనా వేసింది.
జనరల్‌గా తమ పిల్లలు వ్యాపారవేత్తలు కావాలని వారి తల్లిదండ్రులు కోరుకోరు. ఏదో ఒకటి చదివి… మంచి ఉద్యోగం సంపాదించాలని భావిస్తారు. కానీ 42 ఏళ్ల జాసెంకో అలా అనుకోలేదు. తన కూతురు వ్యాపారవేత్త కావాలని కలలుకంది. దానికి తగ్గట్టే ఆ పాప కూడా అలాంటి ఆలోచనలతోనే పెరిగింది. పిక్సీ కూడా తనకు ఇదే ఇష్టమంటోంది. నాకు 14 ఏళ్ల వయసప్పుడు నేను మెక్‌డొనాల్డ్స్‌లో జాబ్ తెచ్చుకున్నాను. అప్పటికి నాకు అది గొప్ప విషయం. నేను దాన్ని పొందగలను అనుకోలేదు. కానీ సాధించాను. ఇప్పుడు నా కూతురు నా కంటే గొప్పగా ఉండాలి. అందుకే తను ఔత్సాహిక వ్యాపారవేత్త కావాలని కోరుకున్నాను. అయ్యింది అని జాసెంకో తెలిపింది.
ఇంతకీ ఈ పాప ఏం అమ్ముతుందంటే… పిల్లల బొమ్మలు, పిల్లలకు అవసరమయ్యే స్టేషనరీ, సరదా గాడ్జెట్స్ వంటివి అమ్ముతుంది. పిక్సీకి ఇన్‌స్టాగ్రామ్‌లో pixiecurtis అనే అకౌంట్ ఉంది. దానికి 90వేల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. నాలుగేళ్ల కిందట… ఆరేళ్ల వయసప్పుడే ఈ చిన్నారి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సరింగ్ యాడ్ కోసం రూ.4.5 లక్షలు తీసుకుంది. పిక్సీ కొత్తగా వచ్చే బొమ్మలకు రివ్యూ ఇస్తుంది. అవి ఎలా వాడాలో, వాటి ధర ఎంతో, ఏ వయసు వారికి బాగుంటాయో చెబుతుంది. ఇలా చిన్నప్పటి నుంచే వ్యాపారంలో లోటుపాట్లు తెలుసుకున్న పిక్సీ ఇప్పుడు నెలకు రెండు వ్యాపారాల ద్వారా రూ.కోటి దాకా సంపాదిస్తోంది.