Arvind Kejriwal : దేశం.. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించింది. ఇంకొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ నెల రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారం లోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యం లో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతు న్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూ హాలను రూపొందించుకుంటోన్నాయి.
ఈ క్రమంలో ఢిల్లీ, పంజాబ్‌లల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం కొత్తగా ఎన్నికల తాయిలాలను ప్రకటించింది. ప్రత్యేకించి మహిళా ఓటుబ్యాంక్‌పై దృష్టి సారించిన ఆ పార్టీ- వరాల జల్లును కురిపించింది. మహిళలను ఆర్థికంగా చేయూత అందించడానికి ఉద్దేశించిన పథకాన్ని ప్రకటించింది.
ఈ పథకం పేరు- ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన. దీని కింద ఢిల్లీలో నివసించే ప్రతి మహిళకు, ప్రతి నెలా 1,000 రూపాయల నగదు మొత్తాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి ఆతిషి వెల్లడించారు. ఈ మేరకు బడ్జెట‌్‌లో ఈ పథకాన్ని పొందుపరిచినట్లు తెలిపారు.
ఈ మధ్యాహ్నం ఆమె అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తమ ప్రభుత్వం వరుసగా పదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోందని, దీనికి గుర్తుగా తమ రాష్ట్రం పరిధిలోని నివసించే ప్రతి మహిళకూ, ప్రతి నెలా 1,000 రూపాయలను మొత్తాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ పథకాన్నిఅమలు చేయడానికి 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల మొత్తం అవసరమౌతుందని అంచనా వేశామని ఆతిషి చెప్పారు. ఈ మేరకు ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చును బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ప్రతి మహిళనూ ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను రూపొందించామని అన్నారు.