Praveena Success Story : కొందరు యువకులు మూస ధోరణిలో వెళ్లరు. తమదైన దారిలో ప్రయాణిస్తున్న ప్రపంచం నివ్వెరపోయే విజయాలు సాధిస్తూ ఉంటారు. పేదరికంలో ఉన్న యువకులు ఉన్నత స్థాయికి ఎదగడం అంతా ఈజీ కాదు. వారిని ఎన్నో కష్టాలు అడ్డుకుంటూ ఉంటాయి. అయినా వారిలో అణువణువు కసితో రగిలిపోతూ ఉంటుంది. ఎదగడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎన్ని త్యాగాలైనా చేస్తారు. చివరకు విజయం సాధిస్తారు. ఇలాంటి కోవకు చెందిన వాడే కర్నాటకలోని దావణగెరె ప్రాంతానికి చెందిన దేవరహొన్నాలి గ్రామానికి చెందిన ఓ యువకుడు. అతడి సాధించిన విజయం చూస్తే ఔరా అనిపించక తప్పదు.
హోన్నాలి గ్రామంలో ఒక పేద రైతు కూలి కుటుంబంలో ప్రవీణ జన్మించాడు. ఆ గ్రామంలో ఉన్న పాఠశాలలో 7వ తరగతి వరకే బోధించేవారు. పైగా ఆ గ్రామానికి సరిగా విద్యుత్ సరఫరా కూడా ఉండేది కాదు. చదువుకోవాలనే కోరికతో 7వ తరగతి వరకు స్థానికంగా ఉన్న పాఠశాలలలో విద్యను అభ్యసించిన ప్రవీణ.. ఆ పై తరగతుల కోసం తమ గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు రోజూ నడిచివెళ్లేవాడు. సెలవు దినాల్లో కూలి పనులకు సైతం వెళ్లేవాడు. అవి అతడి ఖర్చులకు పనికొచ్చేవి. అలా పదో తరగతి ఉన్నతశ్రేణిలో పాసయ్యాడు. వారి ఊరిలో నేరుగా పదో తరగతి పాస్ అయ్యింది ప్రవీణ ఒక్కడే.
ఆ తర్వాతి చదువుల కోసం ప్రవీణ తండ్రి తమ మకాంను దావణగెరెకు మార్చాడు. అక్కడ ఒక మురికివాడలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవీణ స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో చేరాడు. సాయంత్రం పూట ఓ ఫార్మసీలో పనిచేయడం ప్రారంభించాడు. నెలకు 600 రూపాయల దాక సంపాదించేవాడు. అవి అతడి చదువుల ఖర్చులకు ఉపయోగపడేవి. ఆ తర్వాత 2006లో ఫుడ్ బ్రాండ్ పార్లే కంపెనీ నుంచి కోకాకోలా, విప్రో, ఓయో లాంటి కంపెనీలలో పనిచేశాడు. అతడు సేల్స్ విభాగం పనిచేయడం వల్ల ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. కోకాకోలాలో పనిచేస్తున్నప్పుడు సత్యజిత్ ప్రసాద్ అనే వ్యక్తితో ప్రవీణకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సత్యజీత్ ఓయోలో చేరాడు. అతడు చేరిన తర్వాత ప్రవీణను కూడా అందులోకి తీసుకున్నాడు.
ప్రవీణ మైసూర్ లోని ఓయోలో పనిచేస్తున్నప్పుడు దాని వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పనితీరును చూసి ముచ్చటపడేవాడు. అయితే కోవిడ్ సమయంలో ప్రవీణ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఖాళీ సమయంలో ధీరూభాయ్ అంబానీ జీవితగాథ ‘గురు’ సినిమాను చూశాడు. దీంతో అతడు ఎంతో ప్రేరణ పొందాడు. సొంతంగా బిజినెస్ మ్యాన్ గా ఎదగాలని తన ప్రయత్నం ప్రారంభించాడు. భార్యను, కొడుకుని తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టి.. మైసూర్ లో స్వదేశీ గ్రూప్ పేరుతో పునరుత్పాదక ఇంధన ఆధారిత వ్యాపారాన్ని మొదలుపెట్టాడు.
ఆ వ్యాపారం కోసం అతడు పెట్టిన పెట్టుబడి రూ.1800 మాత్రమే. వాటితో కంపెనీని రిజిస్టర్ చేయించాడు. ఆ తర్వాత కర్నాటకలోని టైర్-2,3 పట్టణాల్లో సోలార్ వాటార్ హీటర్లు విక్రయించడం మొదలుపెట్టాడు. అలా ఆ కంపెనీ సోలార్ ద్వారా పనిచేసే అన్ని పరికరాలను తయారు చేయడం మొదలుపెట్టింది. నాణ్యత, మన్నిక ఉండడంతో కస్టమర్లు బాగా పెరిగారు. ఈ ప్రయాణంలో ప్రవీణకు అతడి భార్య చిన్మయ అడుగడుగునా సహకరించింది. నాలుగేళ్లలోనే స్వదేశీ వ్యాపారం 100 కోట్లకు చేరింది.