Health Tips : అన్నింటికంటే తేలికైన వ్యాయామం నడక (వాకింగ్). మనం వేసే ప్రతీ అడుగు మన ఆయుష్షును పెంచుతుందని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక ఆరోగ్య నిపుణులు ఏ స్థాయిలో అనారోగ్యానికి గురైనా వారు నడుస్తున్నారంటే వ్యాయామం కోసం వాకింగ్ చేయాలని చెప్తుంటారు. మంచి ఆరోగ్యకర జీవనానికి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి? 10 వేల అడుగులు వేస్తే సరిపోతుందా? ఎక్కువ నడవాలా? లేదంటే తక్కువ సరిపోతుందా? అసలు దీన్ని ఎలా నిర్ధారిస్తారు? నిపుణులు ఏమంటున్నారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
10 అడుగులు కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే
నిజానికి రోజుకు 10వేల అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిదనే సలహా శాస్త్రవేత్తల నుంచి వచ్చింది కాదు. 1964, టోక్యో ఒలింపిక్స్ ముందు జపాన్ గడియారాల కంపెనీ ‘యమసా’ తమ ఉత్పత్తుల కోసం ఒక ప్రకటన తెచ్చింది. ఆ సమయంలో యమసా ఓ ‘పెడోమీటర్’ ఆవిష్కరించింది. అది మెటల్ బాల్‌తో ఉండే లెక్కింపు పరికరం. దాన్ని నడుముకు కట్టుకుంటే మనం రోజుకు ఎన్ని అడుగులు వేశామనేది లెక్కిస్తుంది. ఒలింపిక్స్ సమయంలో దానికి ఆదరణ దక్కడమే గాక.. వరల్డ్ వైడ్ గా ‘రోజుకు 10వేల అడుగులు’ అనే మాట ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాతనే శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేయడం ప్రారంభించారు.
అధ్యయనాలు ఏం చెప్పాయంటే?
రోజుకు 10వేల అడుగులపై గతేడాది అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ, పోలండ్‌లోని లాడ్జ్ మెడికల్ యూనివర్సిటీ ఓ అధ్యయనం ప్రచురించింది. ఇందుకు 2.26 లక్షల మందితో 17 వేర్వేరు పరిశోధనలు జరిపింది. రోజుకు ఎంతసేపు నడవాలనే ప్రశ్నకు రకరకాల ప్రత్యామ్నాయాలు సూచించారు. మనం వేసే అడుగుల సంఖ్యను బట్టి ప్రయోజనాలుంటాయని వివరించారు.
* ‘రోజుకు 4వేల అడుగులు.. దీంతో అకాల మరణాలకు అరికట్టవచ్చు. ఇది అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అధిక బరువు /ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
* రోజూ 2337 అడుగులు నడిస్తే గుండె సంబంధిత (కార్డియో వాస్కులర్) జబ్బులతో మరణించే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.
* రోజుకు 1000 అడుగులను పెంచుకుంటూ పోతే గుండెజబ్బుల మరణాలు 15 శాతం తగ్గుతాయి. 500 అడుగులు పెంచితే.. 7 శాతం తగ్గుతాయి.
* 60 ఏళ్లు పైబడినవారు రోజుకు 6 వేల నుంచి 10 వేల అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పు 42 శాతం తగ్గుతుంది. అని ఈ పరిశోధకులు సూచించారు.
చిన్న లక్ష్యాలతో మేలు..
‘అయితే రోజూ గరిష్ఠంగా ఎంత నడవాలనే అంశంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచి లాభాలుంటాయని మాత్రం నిపుణులు చెప్తున్నారు. మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే మాత్రం 8 వేల నుంచి 10వేల అడుగులు ఉత్తమం. వ్యాయామాన్ని ఆశ్వాదించడం, రోజుకు అరగంట అయినా వర్కౌట్ చేస్తే ఆరోగ్యకర ప్రయోజనాలు పొందుతారు’ అని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు.
అయితే, ఒక్క రోజులోనే 10వేల అడుగులు సాధ్యం కాకపోవచ్చు. వేగంగా నడిస్తే హార్ట్ పై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి 2,500 నుంచి 3000తో మొదలుపెట్టి ప్రతి 15 రోజులకు 500 చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లు వెయ్యితో మొదలుపెట్టినా చాలు. వృద్ధాప్యంలో అయితే తమ శక్తి మేర లక్ష్యాన్ని పెట్టుకోవాలని సూచిస్తున్నారు.