Vijayasai Reddy: విశ్వవిద్యాలయాల అధ్యాపక పోస్టుల నియామకాల్లో ఎస్‌సి, ఎస్టి, ఓబిసిలకు కేటాయించిన రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ యూని వర్శి టీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) జారీ చేసిన మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్సీపి రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక పోస్టుల నియామకాల్లో ఎస్‌సి, ఎస్టి, ఓబిసిలకు రిజర్వ్ చేసిన ఖాళీలు భర్తీకాని పక్షంలో వాటిని జనరల్ కేటగిరీకి మార్చాలని ప్రతిపాదిస్తూ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో శ్రీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇది ఎస్‌సి, ఎస్‌టి, ఓబీసిలకు రాజ్యాంగం కల్పించిన రక్షణను కాలరాసే చర్యగా అభివర్ణించారు.
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాలయాల్లో ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి అధ్యాపకుల సంఖ్య ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. గత ఏడాది ఆగస్టులో లోక్ సభకు సమర్పించిన సమాచారం ప్రకారం దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్శిటీలలో కలిపి ప్రొఫెసర్లలో 4 శాతం, అసిస్టెంట్ ప్రాఫెసర్లలో 6 శాతం మాత్రమే ఒబిసి అభ్యర్ధులు ఉన్నారు. ఎస్సి అభ్యర్ధులు 7 శాతం ఉండగా ఎస్టి అభ్యర్ధులు కేవలం 1.5 శాతం మాత్రమే ఉన్నట్లు శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత విద్యాలయాల్లో ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి అధ్యాపకుల సంఖ్య ఇంత తక్కువగా ఉన్నప్పటికీ ఆ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ యుజిసి మార్గదర్శకాలు జారీ చేయడం అత్యంత దురదృష్టకరం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాలయాల అధ్యాపక పోస్టుల నియామకాల్లో ఎస్‌సి, ఎస్టి, ఓబిసిలకు రిజర్వ్ చేసిన ఖాళీలను ఎట్టి పరిస్థితులలోను తు.చ తప్పకుండా అమలు చేయవలసిందేనని 2006లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను శ్రీ విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. అలాగే టీచర్ క్యాడర్ నియామకాలకు సంబంధించి ఎస్‌సి, ఎస్టి, ఓబిసిలకు రిజర్వ్ చేసిన పోస్టులను డి-రిజర్వ్ చేయడాన్ని సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ చట్టం 2019 నిరోధిస్తుంది. వీటిని అతిక్రమిస్తూ యుజిసి తాజాగా మార్గదర్శకాలు జారీ చేయడం శోచనీయమని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.