Lok Sabha : లోక్ సభ ముందుకు వక్ఫ్ చట్టం సవరణ బిల్లు.. ఖండించిన విపక్షాలు
Lok Sabha : పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేడు (గురువారం) లోక్ సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు దీనిని ప్రవేశపెట్టారు. దీని ద్వారా వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకోనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
ఈ బిల్లును విపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ విరుద్ధం అంటూ ఖండించింది. బీజేపీ ప్రభుత్వం ఎప్పట్నుంచో ఈ సవరణల గురించి ఆలోచిస్తోందని, ఇది సరైన నిర్ణయం కాదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే ఈ బిల్లును వ్యతిరేకించింది. కొత్త బిల్లు వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువల మేర వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా, ఈ సవరణ బిల్లును బీజేపీ మిత్రపక్షం జేడీయూ సమర్థించింది.