Visakha Fishing Harbor Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 65కి పైగా బోట్లు కాలిపోయాయి. అర్ధరాత్రి అకస్మాత్తుగా జీరో నంబర్ జట్టిలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఇక ఆ తర్వాత బోట్లన్నింటికీ ఈ మంటలు వ్యాపించాయి.
అయితే సముద్రంలో వేటముగించుకొని ఆదివారం సాయంత్రమే మత్స్యకారులంతా తీరానికి చేరుకున్నారు. దీంతో వాటన్నింటినీ ఒక్కచోట లంగరు వేసి ఉంచారు. అయితే పెద్ద ఎత్తున మత్స్యసంపద ఆ బోట్లలోనే ఉండిపోయింది. వాటిని సోమవారం ఉదయం వేలం వేసి విక్రయించాల్సి ఉంది. దాదాపు ఒక్కో బోటులో రూ. 5 లక్షల వరకు చేపలు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. గుర్తు తెలియని వ్యక్తులే నిప్పు ఉంటారని మత్స్యకారులు అనుమానిస్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్లు, డీజిల్ ట్యాంకుల పేలుళ్ల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ఇక విశాఖ పోర్ట్ అథారిటీ నుంచి ప్రత్యేక అగ్నిమాపక నౌక ద్వారా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మత్స్యాకారులంతా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు వాహనాలతో వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. ఆ తర్వాత మరికొన్ని ఫైరింజన్లను తెప్పించారు. అయితే కొంత మంది మత్స్యకారులు తమ బోట్లను ధైర్యంగా సముద్రంలోకి తీసుకెళ్లారు. దీంతో కొంత నష్టం తగ్గింది. అయితే మొత్తంగా రూ. 40 కోట్ల నుంచి రూ. 50 మేర నష్టం జరిగి ఉంటుందని సమాచారం. అయితే సాధారణంగా రాత్రి పూట బోట్లలో మత్స్యకారులు ఎవరూ ఉండరని, అయితే ప్రమాద సమయంలో ఎవరైనా ఉన్నారా అనేది తెలియడం లేదు.
కాగా, కండ్ల ముందే తమ జీవనాధారం మంటల్లో అహుతి కావడం వారిని కన్నీటి పర్యంతమయ్యేలా చేసింది. తమ కుటుంబాలకు ఈ బోట్లే జీవనాధారమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు.