Uttam Kumar Reddy:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముందు నుంచి హ్యాట్రిక్ సాధిస్తామని, మూడవ సారి కూడా అధికారం మాదే, మేమే మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ఆశాగా ఎదురుచూసిన బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఊహించని షాక్ ఇచ్చింది. అంచనాలకు మించి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు సాధించి ఎవరి సపోర్ట్ లేకుండానే తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. త్వరలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది.
ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో సందిగ్థత నెలకొన్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభ స్పీకర్‌ను కలవనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం.
ఈ మధ్యాహ్నం మల్లిఖార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం, ఉప ముఖ్యమంత్రుల ఖరారు తరువాత దీనిపై ఆయన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయమై కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభ స్పీకర్‌ను కలవనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు అనుగునంగా ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణం చేసే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.