Uttam Kumar Reddy:సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటించినా నాకు ఓకే:ఉత్తమ్
Uttam Kumar Reddy:తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికార భారాసను మట్టి కరిపించి ఊహించని విధంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్ర వాప్తంగా కాంగ్రెస్ 64 స్థానాలని సొంతం చేసుకుని విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ ని మించి స్థానాలు దక్కడంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి, డిప్యూటీ సీఎంల విషయంలో మాత్రం ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది.
సీఎల్పీ సమావేశం పూర్తయి నేతలంతా ఏక వాక్య తీర్మానాన్ని అధిష్టానానికి పంపించినా ఇప్పటి వరకు సీఎం అభ్యర్థిపై ఎలాంటి ప్రకటన రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సీనియర్‌లు రేవంత్ రెడ్డి ని సీఎం అభ్యర్తిగా అంగీకరించడం లేదని, అతన్ని సీఎంగా ప్రకటించడానికి వీళ్లేదని, ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న సీనియర్‌లని కాదని అతన్ని సీఎం ఎలా చేస్తారని మండిపడుతున్నారట. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎవరి పేరుని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినా తనకు ఆమోదమేనని తాజాగా సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లిన ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె శివకుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. డీకెతో భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షుడు ఖరారు చేస్తారని, సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటించినా నాకు ఓకే అని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందిన నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నారు.