Big Donation : దేశంలో ఆర్థిక అసమానతలను గమనించిన ఓ యువతి తనకున్న కోట్ల విలువైన ఆస్తుల దానానికి ముందుకొచ్చారు. ఆ ఆస్తుల విలువ ఏకంగా రూ.224 కోట్లు. మార్లిన్ ఎంగెల్ హార్న్ (31) అనే యువతి ఆస్ట్రియాలోని ఓ సంపన్న పారిశ్రామిక కుటుంబంలో జన్మించారు. ఆమెకు వారసత్వంగా వందల కోట్ల విలువైన ఆస్తులు దక్కాయి. అయితే, దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని భావించిన ఆమె, దాదాపు తన సంపద మొత్తాన్ని దానం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే స్థానికంగా విభిన్న రంగాల నిపుణులతో కూడిన ఓ బృందాన్ని (గుటెర్ ర్యాట్) సంప్రదించారు. సంపద పునఃపంపిణీపై ఆ బృందం తన ప్రణాళికలతో ముందుకొచ్చింది. దేశంలోని దాదాపు 77 సంస్థలకు ఆ సంపదను పంచుతామని తెలిపింది. వాతావరణ మార్పులు, విద్య, ఆరోగ్యం, స్త్రీ పురుష సమానత్వానికి కృషి చేసే సంస్థలు, మహిళా ఆశ్రయ కేంద్రాలు, నిరాశ్రయులు నడిపించే వార్తాపత్రికలు, అగ్నిమాపక విభాగాలు, ప్రజాస్వామ్య అనుకూల సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఒకేసారి కాకుండా దీర్ఘకాలిక వ్యవధిలో ఆర్థిక సాయం అందుతుందని తెలిపింది.
‘‘ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా సంపద పునఃపంపిణీతో దేశంలో ఆర్థిక అసమానతలను కొంతమేర రూపుమాపేందుకు యత్నిస్తూన్నా. ఇలా చేయడం అద్భుతంగా అనిపిస్తోంది’’ అని మార్లిన్ ఎంగెల్ హార్న్ పేర్కొన్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది.